ధరణికి బదులు భూమాత!.. తెలంగాణలో అన్ని బెల్టుషాపుల మూత

 ధరణికి బదులు భూమాత!.. తెలంగాణలో  అన్ని బెల్టుషాపుల మూత

 

  • ఉచిత ఇంటర్నెట్.. అమ్మాయిలకు స్కూటీలు
  • బీసీ కులగణన.. సీపీఎస్ ​స్థానంలో ఓపీఎస్
  • ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం.. మేనిఫెస్టోలో కీలక హామీలు పెట్టిన కాంగ్రెస్
  • నేడు గాంధీ భవన్​లో విడుదల చేయనున్న ఏఐసీసీ చీఫ్​ ఖర్గే

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ పార్టీ కీలక హామీలతో పూర్తి స్థాయి తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. శుక్రవారం ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే గాంధీభవన్​లో మేనిఫెస్టో రిలీజ్​చేయనున్నారు. ధరణి పోర్టల్​స్థానంలో భూసమస్యలకు తావు లేని ‘భూమాత’ లేదా ‘భూభారతి’ పేరిట ఆన్​లైన్​ పోర్టల్, యాప్​ను తెస్తామని కాంగ్రెస్​హామీ ఇవ్వబోతున్నది. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ‘పసుపు కుంకుమ’ పథకం పేరిట రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించబోతున్నది.18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీ ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలుస్తున్నది. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్, రాష్ట్రంలోని బెల్టు షాపుల మూత తదితర హామీలతో మేనిఫెస్టో ప్రకటించబోతున్నది. 

మేనిఫెస్టోలో పెట్టనున్న మరికొన్ని అంశాలు

  • రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాల పంపిణీ
  • అన్ని రకాల ప్రధాన పంటలకు బీమా పథకం
  • ఉద్యోగులకు ప్రస్తుతమున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​స్థానంలో ఓల్డ్​పెన్షన్​స్కీమ్​ అమలు
  • గెలిచిన తర్వాత బీసీ కులగణన 
  • జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టులు మరణిస్తే.. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం, హెల్త్​ కార్డులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, మెట్రోలో ఫ్రీ జర్నీ, మీడియా కమిషన్​ఏర్పాటు
  • దివ్యాంగులందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  •  ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, హెరిటేజ్​ట్యాగ్​తో ఉస్మానియా జనరల్​ఆసుపత్రి 
  • పునరుద్ధరణ
  • అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ,  డీఎస్సీ ద్వారా టీచర్​ పోస్టుల భర్తీ, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, వార్షిక ఉద్యోగ క్యాలెండర్​
  • నిర్మాణ రంగ, ఆటో, క్యాబ్​ డ్రైవర్లు,స్విగ్గీ, జొమాటో తదితర గుర్తింపు లేని అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు.
  • సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు.
  • అమ్మహస్తం పేరుతో రేషన్​ దుకాణాల ద్వారా సన్నబియ్యం, 9 నిత్యావసర వస్తువుల పంపిణీ