
- కర్నాటక ఎన్నికల్లో పార్టీకి కలిసొచ్చిన కుల సమీకరణాలు
- ఇక్కడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేలా కసరత్తు
- వారు ఎదుర్కొంటున్న సమస్యలే టార్గెట్
- వాటి ఆధారంగా సర్కారుపై పోరాడేందుకు వ్యూహాలు
హైదరాబాద్, వెలుగు కర్నాటక ఎన్నికల్లో కుల సమీకరణాలే కాంగ్రెస్ విజయానికి కీలకం కావడంతో రాష్ట్రంలోనూ అదే తరహాలో ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో కుల సమీకరణాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కర్నాటకలో బీసీ కులాల జనాభాను లెక్కిస్తామని, 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చాలా సభల్లో ప్రకటించడం వంటివి పార్టీ గెలుపునకు దోహదం చేశాయి. కర్నాటకలో ఎస్సీ, ఎస్టీలనూ ఆ పార్టీ కలుపుకొని ముందుకెళ్లింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఈ ఫార్ములాపైనే పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఒక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల వారికీ సమాన అవకాశాలు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నేతలూ దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. పార్టీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు.. వచ్చే ఎలక్షన్లలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. మహిళా అభ్యర్థులకూ తగినన్ని సీట్లు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అన్ని వర్గాలకూ పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కర్నాటక ఎన్నికల్లో మైనారిటీ ఓట్లతో పాటు జనాభాలో 17 శాతానికిపైగా ఉన్న బీసీలైన లింగాయత్‌ల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు మళ్లడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఇక్కడా బీసీలను ఆకర్షించేలా అలాంటి ఫార్ములానే ఫాలో అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
కులాల వారీగా డిక్లరేషన్లు?
రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పోరాటాన్ని తీవ్రతరం చేసింది. పార్టీపై నిరుద్యోగ యువత దృష్టి పడేలా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై చాలా సీరియస్‌గా పోరాడింది. మరోవైపు రైతులు, మహిళల సమస్యలపైనా గళం ఎత్తుతున్నది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్‌కూడా ప్రకటించింది. ఇప్పుడు ఇదే తరహాలో వివిధ కులాలవారీగా డిక్లరేషన్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు పార్టీలో సునీల్ కనుగోలు టీం సభ్యులు కూడా సర్కారు అవినీతిపై పోరాడుతూనే.. కులాల ఈక్వేషన్పైనా పనిచేస్తున్నది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొం టున్న సమస్యలే టార్గెట్‌గా వ్యూహాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. వాటి ఆధారంగా సర్కారుపై పోరాడుతూనే, ఆయా కులాల ఓటర్లను ఆకర్షించేందు కు ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తున్నది.