రుణమాఫీ చెయ్యట్లే.. 

రుణమాఫీ చెయ్యట్లే.. 

దుబ్బాక, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేండ్లైనా రైతులకు రుణమాఫీ చేయట్లేదని, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను త్వరగా ఇవ్వడం లేదని కాంగ్రెస్​ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతు బంధు సొమ్మును రైతులకు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తక్షణమే బ్యాంకర్లతో చర్చించి రైతులకు రైతు బంధు డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్​కు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలపై ఉన్న ప్రేమ దుబ్బాక నియోజకవర్గంపై లేదన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో నిధుల్లేక ప్రభుత్వ స్కూళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్​ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏసు రెడ్డి, అనంతుల శ్రీనివాస్, గాంధారి నరేందర్​రెడ్డి, పాతూరి వెంకటస్వామి గౌడ్​, అనంతుల రాజు, ఆకుల భరత్​, కొంగరి రవి, కొత్త గోపాల్​ రెడ్డి పాల్గొన్నారు.