గ్యాస్ బండకు దండలేసి.. డప్పు కొట్టి నిరసన

గ్యాస్ బండకు దండలేసి.. డప్పు కొట్టి నిరసన

పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలంతా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళన చేశారు. అలాగే రాష్ట్రంలోనూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు.. గ్యాస్ సిలిండర్‌‌కు పూల దండలు వేసి, స్టీల్ ప్లేట్లతో డప్పులు మోగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ధరలు తగ్గించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. 

గుండు కొట్టించుకుని నిరసన..

పెట్రో, గ్యాస్, కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీఎన్‌ రెడ్డి నగర్ నుంచి వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వరకు ర్యాలీ తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు.  పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ... ఓ వ్యక్తి గుండు కొట్టించుకుని నిరసన తెలిపాడు.

హైవేపై బైఠాయింపు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలంలోని తుంకిమెట్లలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ట్రాఫిక్ క్లియర్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన కేటీఆర్

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని హైకోర్టులో పిల్

పెట్రోల్ రేట్లపై జర్నలిస్ట్ ప్రశ్న.. రాందేవ్ గుస్సా