ఫస్ట్ లిస్టులో ఏడుగురికి చోటు .. మరో ఆరు సీట్లపై సస్పెన్స్

ఫస్ట్ లిస్టులో ఏడుగురికి చోటు ..   మరో ఆరు సీట్లపై సస్పెన్స్

కరీంనగర్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్​లో  ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురికే చోటు దక్కింది. మరో ఆరు సీట్లపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. జగిత్యాల టికెట్ టి. జీవన్ రెడ్డికి, ధర్మపురి(ఎస్సీ)  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, రామగుండం టికెట్ ఎంఎస్ రాజ్ ఠాకూర్, మంథని టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి టికెట్ విజయరమణారావుకు, వేములవాడ ఆదిశ్రీనివాస్ కు, మానకొండూరు(ఎస్సీ) డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు  అవకాశం దక్కింది. టికెట్లు పొందినవారిలో  ఆది శ్రీనివాస్, ఎంఎస్ రాజ్​ ఠాకూర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాగా, మరో ముగ్గురు ఓసీలు ఉన్నారు. 

మొత్తం 85 అప్లికేషన్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్   నుంచి పోటీ చేసేందుకు మొత్తం 85 మంది అప్లై చేసుకున్న విషయం తెలిసిందే.  జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అప్లికేషన్ ఒక్కటి మాత్రమే రాగా ఆయనకే టికెట్ కన్ఫమైంది. మంథని నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శివనందరి ప్రమోద్ కుమార్ అప్లై చేసుకోగా  శ్రీధర్ బాబుకు టికెట్ వచ్చింది.  ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన మానుకొండూరు నుంచి డీసీసీ ప్రెసిడెంట్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ, తిప్పర సంపత్ దరఖాస్తు చేసుకున్నారు.

కవ్వంపల్లికి పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి టికెట్ కోసం చింతకుంట విజయ రమణారావు, కిరణ్ కుమార్ వేల్పుల, గంటా రాములు, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య పోటీ పడగా స్ర్కూట్నీ అనంతరం విజయరమణరావుకే టికెట్ కేటాయించారు. ఇప్పటికే విజయరమణారావు నియోజకవర్గంలో యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారు.  ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన ధర్మపురి నుంచి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గజ్జెల స్వామి, వడ్లూరి  కృష్ణ, గుమ్మడి  కుమార స్వామి, బండారి కనకయ్య, రవీందర్ మద్దెల, బోళ్ల స్వామి కాంగ్రెస్ టికట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కే టికెట్ దక్కింది.

2009 నుంచి 2018 ఎన్నికల వరకు నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ కుమార్ ప్రతిసారి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోతున్నారు. దీంతో ఈ సారి కూడా పార్టీ టికెట్ ఆయనకే ఇచ్చింది. రామగుండం నుంచి పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్, హర్కర వేణుగోపాలరావు, బజ్‌‌పల్ జనక్ ప్రసాద్, అంచర్ల మహేష్ యాదవ్ , రియాజుద్దీన్ అహ్మద్, గంటా సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసుకున్నారు.

ఐఎన్ టీయూసీ నేత జనక్ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్​ ఠాకూర్ మధ్యే టికెట్ కోసం పోటీ నెలకొనగా చివరికి ఎంఎస్ రాజ్ ఠాకూర్ కే టికెట్ దక్కింది. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ముడికె చంద్ర శేఖర్ యాదవ్, తొట్ల అంజయ్య యాదవ్, సింగిరెడ్డి నరేశ్​ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆది శ్రీనివాస్ కే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి గతంలో నాలుగుసార్లు పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారిఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రజల్లో తిరుగుతున్నారు.  

మరో ఆరు సీట్లపై సస్పెన్స్

టికెట్లు అనౌన్స్ చేయని కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్, చొప్పదండి, హుస్నాబాద్, కోరుట్ల నియోజకవర్గాలపై సస్పెన్స్ నెలకొంది. ఫస్ట్ లిస్టులోనే కోరుట్ల, చొప్పదండి, సిరిసిల్ల అభ్యర్థుల పేర్లు వస్తాయని భావించినప్పటికీ.. అలా జరగలేదు.   కరీంనగర్ నియోజకర్గం నుంచి మైత్రి గ్రూప్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ మధ్యే టికెట్ పోటీ నెలకొంది. ఇన్నాళ్లు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన రోహిత్ రావు.. చివరికి తాను పురుమల్ల శ్రీనివాస్ కే మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.  హుజురాబాద్ టికెట్ వొడితల ప్రణవ్ కు, హుస్నాబాద్ టికెట్ పొన్నం ప్రభాకర్ కు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగినప్పటికీ ఫస్ట్ జాబితాలో వీరికి చోటుదక్కలేదు.