కరప్షన్, ఘర్షణల్లో రాజస్థాన్ టాప్: మోదీ

కరప్షన్, ఘర్షణల్లో రాజస్థాన్ టాప్: మోదీ
  • బుజ్జగింపుల కోసం ఆ పార్టీ ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తది
  • పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తదని కామెంట్స్ 

జైపూర్​: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో అవినీతి, అరాచకాలు పెరిగిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్​ అయ్యారు. భారత్ విశ్వ గురువుగా ఎదుగుతుంటే కాంగ్రెస్​ పాలనలోని రాజస్థాన్ మాత్రం అవినీతి, అల్లర్లలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. శనివారం ప్రధాని మోదీ రాజస్థాన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భరత్‌‌పూర్‌‌లో జరిగిన ర్యాలీ, సభలో కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు. సీఎం అశోక్ గెహ్లాట్‌‌ను ‘జాదూగర్’ గా పేర్కొన్నారు. ఈ సారి ఆయన ట్రిక్స్ ఏవీ పనిచేయవని.. ఆ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. 

ఎన్నికల తర్వాత రాజస్థాన్​ నుంచి కాంగ్రెస్ పార్టీ  అదృశ్యం అవుతుందన్నారు.మహిళలు, దళితులపై ఎన్నో ఘోరాలు కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానాలతో టెర్రరిస్టులు, సంఘవ్యతిరేక శక్తులకు ఫ్రీడం ఇవ్వడంతో నేరాలు, అల్లర్లలో రాష్ట్రం నంబర్​ వన్ గా మారిందని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ బుజ్జగింపుల కోసం ఎంతదాకైనా వెళ్తుందనీ.. ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెడుతుందన్నారు. 

ఐదేండ్లలో రాష్ట్రంలో మహిళలు, దళితులపై ఎన్నో ఘోరాలు జరిగాయని చెప్పారు. ‘‘హోలీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇలా ఏ పండుగను రాజస్థాన్​ ప్రజలు శాంతియుతంగా జరుపుకోలేరు. అల్లర్లు, రాళ్ల దాడి, కర్ఫ్యూ, ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతాయి. మహిళలు ఫేక్ రేప్ కేసులు పెడతారనే సీఎం గెహ్లాట్.. వారికి రక్షణ కల్పించగలరా? ఆయనకు ఒక్క నిమిషం కూడా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత ఉందా?’’ అని ప్రశ్నించారు.

రహస్యాలన్నీ రెడ్​డైరీలో

రాజస్థాన్‌‌లో ద్రవ్యోల్బణం, పెట్రోలు, డీజిల్ రేట్ల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోదీ అన్నారు. పొరుగున ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్‌‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97 ఉండగా, రాజస్థాన్‌‌ మాత్రం లీటర్ పెట్రోల్‌‌కు రూ.109 వసూలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెట్రో రేట్లపై సమీక్షిస్తుందన్నారు. జాదూగర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మైనింగ్ మాఫియాకు ఎలా అప్పగించిందనే రహస్యం ‘రెడ్ డైరీ’ లో ఉందన్నారు. గెహ్లాట్ అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రెడ్ డైరీ తన వద్ద ఉందని మంత్రివర్గం నుంచి తొలగించిన రాజేంద్ర గతంలో పేర్కొన్నారు. దీనినే ప్రధాని మోదీ తాజాగా ఎన్నికల ర్యాలీల్లో ప్రస్తావిస్తున్నారు.