పురుమల్ల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు  

పురుమల్ల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు  
  • మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలతో చర్యలు
  • టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉత్తర్వులు 

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలపై వేటు వేసినట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. బీఆర్ఎస్ లో బొమ్మకల్ సర్పంచ్ గా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి.. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి  పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. గత జనవరిలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  మళ్లీ గత నెల 28న కరీంనగర్ లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై జరిగిన మీటింగ్ లో మంత్రి పొన్నంపై  శ్రీనివాస్ మరోసారి పరోక్ష దూషణలకు దిగారు. దీనిపై  కరీంనగర్ ముఖ్య నేతలు అధిష్టానం దృష్టికి  తీసుకెళ్లారు. పార్టీ నుంచి శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో  200 మంది నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు, క్రమశిక్షణ సంఘం  చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు.

విచారించి  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నివేదిక తెప్పించుకున్న తర్వాత శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.