దక్షిణంలో కాంగ్రెస్​ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు

దక్షిణంలో కాంగ్రెస్​ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు

ఖమ్మం, వెలుగు :  తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్​ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం సీట్లను ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​ నగర్​ జిల్లాల్లోనే  ఆ పార్టీ గెలుచుకుంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లను కాంగ్రెస్ కూటమి సాధించింది. 31 సీట్లలో కాంగ్రెస్​అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఫలితాలను పునరావృతం చేస్తూ పది స్థానాలకు గాను ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్​అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన 9 చోట్ల కాంగ్రెస్​ కూటమి గెలిచింది. 8 చోట్ల కాంగ్రెస్​, మరో చోట సీపీఐ అభ్యర్థి విన్ ​అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ12 సీట్లలో సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్​ గెలిచింది. మిగిలిన11 సీట్లలో కాంగ్రెస్​ విక్టరీ కొట్టింది. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో14 సీట్లకు గాను 2 సీట్లతో బీఆర్ఎస్​ సరిపెట్టుకోగా, మిగిలిన12 సీట్లలో కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించారు.

గత బీఆర్ఎస్ అధికారంలోనూ ఇవే కీలకం​

2018 ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్​ అధికారంలోకి రావడంలో ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాలు కీలకమయ్యాయి. అప్పట్లో ఈ రెండు జిల్లాల్లోనూ ఆ పార్టీ మెజార్టీ సీట్లను గెలుపొందింది. మహబూబ్ నగర్​ జిల్లాలో13 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట కాంగ్రెస్ ​అభ్యర్థి గెలవగా, ఎన్నికల తర్వాత ఆ కాంగ్రెస్​ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్​లో చేరారు. ఇక నల్గొండ జిల్లాలో12 స్థానాలకు గత ఎన్నికల్లో 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 9 సీట్లలో బీఆర్ఎస్​ విన్​ అయింది. ఆ తర్వాత ఒక కాంగ్రెస్ ​ఎమ్మెల్యే బీఆర్ఎస్​లో చేరగా, మునుగోడు, నాగార్జున సాగర్​ఉప ఎన్నికలో బీఆర్ఎస్​ గెలిచింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా బీఆర్ఎస్​కు ఒక్క సీటే వచ్చింది. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ నుంచి గెలిచిన వారిలో నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు, ఇండిపెండెంట్​గా గెలిచిన ఎమ్మెల్యే ఒకరు మొత్తం ఏడుగురు బీఆర్ఎస్​లో చేరారు. ఈసారి ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ​నుంచి కాంగ్రెస్​ లో చేరడంతో మళ్లీ ఒక్క సీటుతోనే బీఆర్ఎస్ ​సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భాగమైన రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్​కు10, కాంగ్రెస్​కు 6 సీట్లు రాగా, హైదరాబాద్​లో మాత్రం కాంగ్రెస్​ బోణి కొట్టలేదు. ఏడు చోట్ల బీఆర్ఎస్​, 7 చోట్ల ఎంఐఎం, ఒక చోట బీజేపీ గెలిచింది.