కాంగ్రెస్​ అలర్ట్!.. ఎన్నికల ఫలితాల వేళ రంగంలోకి పార్టీ హైకమాండ్

కాంగ్రెస్​ అలర్ట్!.. ఎన్నికల ఫలితాల వేళ రంగంలోకి పార్టీ హైకమాండ్
  • గెలిచే అభ్యర్థులను కాపాడుకునేందుకు చర్యలు  
  • అందరినీ హైదరాబాద్​కు తరలించాలని మొదట నిర్ణయం
  • కానీ కౌంటింగ్ కేంద్రాల వద్దే అభ్యర్థులు ఉండాలన్న రాహుల్
  • ఫలితాల ట్రెండ్​ను బట్టే నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
  • ఇప్పటికే హైదరాబాద్​కు చేరుకున్న డీకే శివకుమార్ 
  • తమ పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్ చేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ అప్రమత్తమైంది. అన్ని ఎగ్జిట్​పోల్స్ కాంగ్రెస్​కే అనుకూలంగా ఉండడంతో చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలని ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం నేరుగా పార్టీ హైకమాండే రంగంలోకి దిగింది. కౌంటింగ్​కేంద్రాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గెలిచే అభ్యర్థులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఫలితాలను బట్టి అవసరమైతే అభ్యర్థులను క్యాంప్​నకు తరలించేందుకు కసరత్తు చేస్తున్నది. 

ఆ బాధ్యతలను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కు అప్పగించింది. ఆయన శనివారం రాత్రే హైదరాబాద్​కు చేరుకున్నారు. మరో ముగ్గురు కర్నాటక మంత్రులు కూడా వస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, కౌంటింగ్​ వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై పీసీసీ నేతలకు రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​కుమార్ ​రెడ్డి తదితర సీనియర్​ నేతలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. 

కౌంటింగ్ కేంద్రాలకు ఏఐసీసీ అబ్జర్వర్లు.. 

కౌంటింగ్​ను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలోని 49 సెంటర్లకు ఏఐసీసీ నేతలను అబ్జర్వర్లుగా నియమించింది. వాళ్లను మానిటర్ చేసే బాధ్యతలను పి.చిదంబరం, సుశీల్​కుమార్​షిండే, రణ్​దీప్ ​సుర్జేవాలాకు అప్పగించింది. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏఐసీసీ అబ్జర్వర్లెవరూ బయటకు రావొద్దని, అక్కడే ఉండి అభ్యర్థులకు అన్ని విధాలుగా సాయమందించాలని రాహుల్ ఆదేశించినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో చిన్న చిన్న తప్పులు చేయడం, అతి స్వల్ప మెజారిటీతోనే కొందరు అభ్యర్థులు ఓడిపోవడం, ఓట్ల లెక్కల్లో తేడాలు రావడంతో.. ఈసారి ప్రతి ఒక్క ఓటునూ విలువైనదిగానే భావించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం. 

కాంగ్రెస్ అభ్యర్థులకు అధికార పార్టీ నుంచి వస్తున్న బేరసారాలపైనా రాహుల్ ఆరా తీసినట్టు తెలిసింది. అయితే అభ్యర్థులందరినీ హైదరాబాద్​కు తరలించే యోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు చెప్పడంతో.. అలా చేయొద్దని రాహుల్​ సూచించినట్టు తెలుస్తున్నది. అభ్యర్థులు హైదరాబాద్​లో ఉంటే కౌంటింగ్ ​కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, అందుకే అభ్యర్థులందరూ అక్కడే ఉండాలని చెప్పినట్టు సమాచారం. కౌంటింగ్ ​ట్రెండ్, రిజల్ట్​ను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. రాహుల్ ఆదేశాలతో అభ్యర్థులంతా కౌంటింగ్​ కేంద్రాల వద్దే ఉండాలని పీసీసీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తున్నది. 

ఫలితాలను బట్టి బెంగళూరుకు అభ్యర్థులు..  

ఫలితాల ట్రెండ్​ను బట్టి గెలిచిన అభ్యర్థులను బెంగళూరుకు తరలించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. 80కి పైగా సీట్లు సాధిస్తామని కాంగ్రెస్​ నేతలు ధీమాగా చెబుతున్నారు. డిసెంబర్​ 9న ప్రమాణ స్వీకారం కూడా చేస్తామంటున్నారు. అయితే, ముందు జాగ్రత్తగా అభ్యర్థులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. 70కి పైగా సీట్లు వస్తే అభ్యర్థులను ఇక్కడే ఉంచాలని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ మెజారిటీ 60 దాటి కొంచెమే ఎక్కువొస్తే మాత్రం బెంగళూరు క్యాంప్​నకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్​ నేతలు కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు ఫోన్​చేశారన్న ప్రచారం నేపథ్యంలో హార్స్​ ట్రేడింగ్​కు ముందే అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. 

తొలుత హైదరాబాద్​కు రమ్మని.. 

రాహుల్ ​మీటింగ్​కు ముందు పార్టీ అభ్యర్థులందరూ హైదరాబాద్​కు రావాల్సిందిగా పీసీసీ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. సీట్లలో కొంచెం తేడా వస్తే, తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తన్నుకు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో అభ్యర్థులందరూ శనివారం సాయం త్రమే హైదరాబాద్​కు రావాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. వాళ్ల కోసం తాజ్​కృష్ణాలో బస ఏర్పాట్లు కూడా చేశారని, శనివారం రాత్రి అభ్యర్థులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు అభ్యర్థులు గెలిస్తే వాళ్ల తరఫున సర్టిఫికెట్ తీసుకునేందుకు.. ఆ అభ్యర్థి తరఫున అక్కడున్న చీఫ్​ కౌంటింగ్​ ఏజెంట్​కు ఆథరైజేషన్​ ఇవ్వాలంటూ సీఈవో వికాస్​రాజ్​ను కాంగ్రెస్ నేతలు కోరారు. దానికి సీఈవో ఆమోదం కూడా తెలిపారు. అయితే, రాహుల్​ఆదేశాలతో చివరి నిమిషంలో అభ్యర్థులను హైదరాబాద్​కు తరలించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని తెలిసింది. డీకే శివకుమార్​ మాత్రం తాజ్ కృష్ణా నుంచే కౌంటింగ్ ​ట్రెండ్​పై పరిశీలన చేస్తారని చెబుతున్నారు. కాగా, కౌంటింగ్​ కేంద్రాల వద్ద అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్​రూమ్ ​ఇన్​చార్జులు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మా వాళ్లకు కేసీఆర్ ఫోన్లు చేస్తున్నడు: డీకే శివకుమార్ 

సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది. మా అభ్యర్థులంతా పార్టీకి విధేయంగా ఉన్నారు. సీఎం కేసీఆర్​తమకు ఫోన్లు చేస్తున్నారని మా పార్టీ అభ్యర్థులే స్వయంగా నాకు చెప్పారు. మేం కచ్చితంగా సేఫ్​సైడ్​లో ఉన్నాం” అని చెప్పారు.