గాంధీలు కాంగ్రెస్​ పగ్గాలు వదిల్తేనే మేలు

గాంధీలు కాంగ్రెస్​ పగ్గాలు వదిల్తేనే మేలు

మొన్నటి అయిదు రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చాయి. కాంగ్రెస్​  మాత్రం తీవ్ర నష్టం చవిచూసింది. అచ్చే దిన్‌‌‌‌ ఆయేగా అని మోడీ చెప్పినట్లు మంచి రోజులు వచ్చినా రాకపోయినా ప్రజలంతా బీజేపీకే సంఘీభావం తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కరోనా ఇబ్బందులు ఇలా సమస్యలు ఎన్ని ఉన్నా ప్రధాని మోడీ వెంటే ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే కాంగ్రెస్​ పార్టీ విషయంలో మాత్రం ప్రజలు అందుకు పూర్తి విరుద్ధంగా తీర్పు నిచ్చారు. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఎక్కడా ప్రజల మద్దతు కూడబెట్టలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో దాదాపు 200కు పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. పార్టీని గెలిపించడం కోసం తన శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఆమె తన పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే తీసుకురాగలిగారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 6.22 శాతం ఓట్లతో గెలిచి 7 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓటిమి పాలైంది. 2.33 శాతం ఓట్లు సాధించి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ పోటీ చేసిన ఇతర 397 స్థానాల మాదిరిగానే ఇంతకాలం గాంధీల కంచుకోటలుగా ఉన్న రాయ్‌‌‌‌బరేలీ, అమేథీ స్థానాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రియాంక గాంధీ గట్టిగా ప్రయత్నించలేదని కాదు. వాస్తవానికి ఆమె ‘లడ్కీ హు.. లడ్ సక్తి హు’ నినాదంతో విస్తృత ప్రచారం చేపట్టారు. మహిళల కోసం అనేక సంక్షేమ, ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. ప్రధాని మోడీ ప్రకటించిన పథకాలకు ఆకర్షితులై మహిళలు బీజేపీకి గంపగుత్తగా ఓటేశారు. ప్రజలు బీజేపీకి లేదా సమాజ్‌‌‌‌వాదీ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రీయ లోక్‌‌‌‌దళ్‌‌‌‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఊహించినట్లుగానే జాట్‌‌‌‌లు, యాదవేతర ఓట్లను సాధించడంలో ఆ పార్టీ విఫలమైంది.

అధినాయకత్వం తీరు వల్లే..

చాలా కాలం తర్వాత ప్రభుత్వాలు మారిన ఉత్తరాఖండ్‌‌‌‌లో ఈసారి కాంగ్రెస్‌‌‌‌కు అవకాశం వస్తుందని అంతా ఊహించారు. కానీ అక్కడ కూడా పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్​ రావత్ కూడా తన సొంత సీటును కాపాడుకోలేకపోయారు. గోవా, మణిపూర్‌‌‌‌లలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాంగ్రెస్ తనకు తానుగా ఓట్లను సంపాదించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీ మరోసారి తన ప్రభుత్వాలను నిలుపుకోవడానికి కాంగ్రెస్​ పార్టీనే మార్గం సుగమం చేసినట్లు అయింది. పంజాబ్‌‌‌‌లో చరణ్‌‌‌‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా ప్రముఖులందరూ ఓటమి పాలయ్యారు. పంజాబ్‌‌‌‌లో ఆప్ వేవ్​ వల్లే కాంగ్రెస్‌‌‌‌ క్లీన్​ స్వీప్​ అయిందని వాదించే వాళ్లు కూడా ఉండొచ్చు. అయితే కాంగ్రెస్​ గెలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, అధినాయకత్వం వ్యవహరించిన తీరు వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైందన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్‌‌‌‌ను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదీగాక హరీశ్ రావత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌‌‌‌లోనే సక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉండగా, పార్టీ అధినాయకత్వం ఆయనను ఏఐసీసీ ఇన్​చార్జిగా పంజాబ్‌‌‌‌కు పంపింది. దీంతో ఆయన అక్కడా విజయం సాధించలేకపోయారు.. ఇటు పంజాబ్​లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 

సీడబ్ల్యూసీ మీటింగ్​లో  

అధినాయకత్వం నిర్ణయాల ఫలితంగా పార్టీకి జరిగిన నష్టంపై గాంధీలను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ అందుకు ముందుకొచ్చేవారు ఎవరున్నారన్నది ప్రశ్న.  మొన్నటి సీడబ్ల్యూసీ సమావేశంలో ఎప్పటిలాగే అధినాయకత్వం తీరును ప్రశ్నించే వారి కంటే.. వారికి మద్దతు తెలిపే వారే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ కమిటీ సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పాతపద్ధతిలో సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించడం గమనార్హం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌‌‌‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్‌‌‌‌ నేతలు గులాం నబీ ఆజాద్‌‌‌‌ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారని, ఆ సమావేశానికి ఆనంద్‌‌‌‌ శర్మ, కపిల్‌‌‌‌ సిబల్, మనీష్‌‌‌‌ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు వార్తలు వచ్చినా.. మీటింగ్​ రోజు మాత్రం పెద్దగా అసంతృప్తి వ్యక్తం కాలేదు.పార్లమెంట్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్‌‌‌‌ శిబిర్‌‌‌‌ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని కాంగ్రెస్​ కార్యదర్శి ప్రకటించారు. 

ఓటమిపై కమిటీలు వేసినా..

2014 నుంచి ‌‌‌‌కాంగ్రెస్​కు దేశంలో గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. పార్టీ ఓటమి, ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు వివిధ సందర్భాల్లో కమిటీలను ఏర్పాటు చేసినా.. అవి చేసిన సిఫార్సులను అమలు చేయడంలో పార్టీ హైకమాండ్ విఫలమైంది. బడ్జెట్​సెషన్​ తర్వాత జరిగే చింతన్ శిబిర్‌‌‌‌ లో అసమ్మతివాదులు గొంతును అణచివేస్తూ.. గాంధీలను మళ్లీ కొనసాగించేందుకే ఎక్కువ మంది మద్దతు తెలిపే అవకాశం ఉంది. పార్టీ అధినాయకత్వం స్థానం నుంచి గాంధీలు తప్పుకుంటే పార్టీలో చీలిక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన రెండు రాష్ట్రాలు ఛత్తీస్‌‌‌‌గఢ్,రాజస్థాన్ ఇప్పటికీ కాంగ్రెస్​ పట్టులో ఉన్నందున, అదే స్థాయిలో మళ్లీ తిరిగి దేశంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. కానీ, పంజాబ్‌‌‌‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత అది అంత తేలికేనా? అరవింద్ కేజ్రీవాల్ ఆప్​ను బలోపేతం చేయడానికి ఆ రాష్ట్రాలనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కంటే కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి అధికారం పొందడం ఆప్​కు సులభమైన పని. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, భూపీందర్ సింగ్ హుడా, కపిల్ సిబల్, శశి థరూర్ వంటి సీనియర్లు కాంగ్రెస్‌‌‌‌ను పునరుద్ధరించడానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరమని భావిస్తున్నారు.చింతన్ శిబిరంలో లేదా అంతకు ముందే వారు ఏఐసీసీ సెషన్‌‌‌‌ను నిర్వహించాలనే డిమాండ్‌‌‌‌ను లేవనెత్తే అవకాశం కన్పిస్తోంది. అక్కడ గాంధీలను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. వారందరికీ పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు. కాంగ్రెస్ కుప్పకూలకుండా, మసకబారకుండా ఉండేందుకు వారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. గత ఎనిమిదేండ్లలో కాంగ్రెస్ కేవలం 5 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించగా, దాదాపు 40 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీనామాలు చేస్తానని ముందు చెప్పినా, మెజారిటీ నేతల అభీష్టం మేరకు కొనసాగేందుకు అంగీకరించిన గాంధీలు, ముందున్న మార్గం అడ్డంకులతో కూడుకున్నదని గ్రహించాలి. దేశంలో మారుతున్న సమీకరణల దృష్ట్యా మోడీ విజయ పరంపరను ఆపడం లేదా తిప్పికొట్టడం చాలా కష్టమైన  పని. అంతేకాకుండా ఆప్​ కూడా ఢిల్లీ అభివృద్ధి రికార్డుతో రెట్టింపు ఉత్సాహంతో మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతోంది. ఈ స్థితిలో కాంగ్రెస్​ పునర్వైభవం సాధిస్తుందనడానికి అవకాశాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి సొంత పార్టీ నేతలే ‘దిగిపోండి’ అనే లోపే గాంధీలే అధినాయకత్వం నుంచి తప్పుకోవడం మేలు. గుజరాత్‌‌‌‌, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లలో జరిగే తదుపరి రౌండ్‌‌‌‌ ఎన్నికలు కాంగ్రెస్‌‌‌‌కు కఠినంగా మారనున్నాయి. నవంబర్‌‌‌‌లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. మోడీ, అమిత్ షాల సొంత గడ్డ అయిన గుజరాత్‌‌‌‌లో బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకోవడం కాంగ్రెస్‌‌‌‌కు అసాధ్యమైన విషయం.

అధికారం ఉన్న రాష్ట్రాల్లోనూ గొడవలే..

ప్రస్తుతం అధికారంలో ఉన్న చత్తీస్​గఢ్, రాజస్థాన్​ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​ పార్టీ తీరు అంత బాగా ఏమీ లేదు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ నేతల మధ్య గొడవలే నడుస్తున్నాయి. చత్తీస్‌‌‌‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్​ తో ఆ పార్టీ లీడర్​ టీఎస్​ సింగ్​ డియో రెండున్నరేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించే అవకాశం తనకు ఇవ్వాలని పలుసార్లు తలపడ్డారు. రాజస్థాన్‌‌‌‌లో కూడా అదే తీరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య పోరు అందరికీ తెలిసిందే. రాష్ట్రం-యూనిట్‌‌‌‌లో విభేదాల కారణంగా పంజాబ్‌‌‌‌లో గందరగోళం సృష్టించిన గాంధీలు ఈ రెండు రాష్ట్రాలను నిర్వహించడం కష్టమే. గాంధీలు ఇప్పటికే దారుణ స్థితిలో ఉన్నందున, అసమ్మతిని అణచివేయడం కష్టతరమైన పనే. రోజురోజుకు దేశంలో మోడీ మ్యాజిక్​ పెరిగిపోతున్న దృష్ట్యా.. ఇక వారు సాధించడానికి ఏమీ లేదు. కాబట్టి ప్రతిపక్ష నేతల హేళనలు భరించేకంటే, సొంత పార్టీ నేతల ఆదరణ పొందుతూ కాంగ్రెస్​ బాధ్యతల నుంచి తప్పుకోవడం అన్ని విధాల మేలు.

:: అనితా సలూజా, పొలిటికల్​ కామెంటేటర్