
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సమిష్టి, సమ్మిళిత ఆలోచనలు చాలా ముఖ్యమని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. కొన్ని అంతర్గత మార్పులు తీసుకొస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. ఏ గ్రూప్, బీ గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ పుంజుకోదని అన్నారు. ఇటీవల హిమాచల్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
పార్టీ పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన ఆయన కాంగ్రెస్ కు అవసరమైన చోటల్లా ప్రచారం చేస్తానని పునరుద్ఘాటించారు. 2018లో రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఎవరూ కోరకపోయినా రాహుల్ గాంధీ రాజీనామా చేశారని ఆనంద్ శర్మ తెలిపారు. పార్టీ ఫ్యాక్షనిజం నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఆనంద్ శర్మ సూచించారు.