పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి

పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి
  • పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి
  • సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షద్వీప్​కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి
  • మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అవిశ్వాసాలు

పాలమూరు/యాదాద్రి/ సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల పర్వం కొనసాగుతున్నది. శనివారం మహబూబ్​నగర్, కోదాడ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్​పార్టీ చైర్మన్ ​పీఠాలు కోల్పోగా.. అధికార కాంగ్రెస్​ పార్టీ వాటిని కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్​పార్టీకి చెందిన చైర్మన్ కేసీ నర్సింలు, వైస్ చైర్మన్ గణేశ్​పదవులు కోల్పోయారు. 

మున్సిపాలిటీలో 49 మంది స్థానాలు ఉండగా, అందులో మెజార్టీ స్థానాలను దక్కించుకొని బీఆర్ఎస్ చైర్మన్​ పీఠం దక్కించుకున్నది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాస తీర్మానం పెట్టారు. 32 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి ఇటీవల మహబూబ్​నగర్ కలెక్టర్ రవినాయక్ కు అవిశ్వాస పత్రాలు అందజేశారు. ఈ మేరకు శనివారం అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించడంతో అవిశ్వాసం నెగ్గింది. త్వరలోనే కాంగ్రెస్​కు మద్దతుగా ఉన్న కౌన్సిలర్ల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. 

కోదాడలోనూ నెగ్గిన అవిశ్వాసం 

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. చైర్ పర్సన్ వనపర్తి శిరీష, వైస్ చైర్మన్ వెంపటి పద్మ తమ పదవులను కోల్పోయారు. కోదాడలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒక సీటు ఖాళీగా ఉంది. బీఆర్ఎస్ కు చెందిన కొందరు కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్​కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. మున్సిపాలిటీలో శనివారం జరిగిన ప్రత్యేక మీటింగ్ కు ఒకరు హాజరు కాకపోగా 33 మంది అటెండ్​అయ్యారు. ఈ 33 మందిలో 29 మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. ముగ్గురు వ్యతిరేకించగా మరొకరు తటస్థంగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గినట్టుగా ప్రిసైడింగ్​ఆఫీసర్​సూర్యనారాయణ ప్రకటించారు.

మరో రెండు చోట్ల వీగింది..

యాదాద్రి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో మొత్తం12 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్​వస్పరి శంకరయ్యపై 8 మంది అవిశ్వాసం ప్రకటించారు. వీరిలో ఐదుగురు బీఆర్ఎస్​ అసంతృప్తి కౌన్సిలర్లు ఉన్నారు. ఆలేరులో శనివారం ప్రిసైడింగ్​ఆఫీసర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్​ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​కు అవిశ్వాసంపై సంతకాలు చేసిన వారిలో ఐదుగురు మాత్రమే వచ్చారు. అ విశ్వాసంపై సంతకాలు చేసిన ముగ్గురు సహా ఏడు గురు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పర్యవేక్షణలో ఉండి మీటింగ్​కు రాలేదు. అవిశ్వా సం మీటింగ్​సాగాలంటే కోరంగా 8 మంది సభ్యు లు ఉండాలి. ఐదుగురు మాత్రమే హాజరుకావడం తో మీటింగ్​ను రెండుమార్లు వాయిదా వేసిన ఆర్డీవో.. చివరకు అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు.

సూర్యాపేటలో ఖాళీ కుర్చీలు 

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్​కు 30 మంది ఉ న్నారు. వీరిలో16 మంది చైర్​పర్సన్​అన్నపూర్ణ, వైస్​ చైర్మన్ ​కిశోర్​పై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, బీజే పీ, బీఎస్పీ కౌన్సిలర్లతో కలిసి మొత్తం 32 మంది అవిశ్వాసం ప్రకటించారు. దీంతో చైర్మన్, వైస్​చైర్మన్​సహా సమ్మతిగా ఉన్న కౌన్సిలర్లను ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి లక్షద్వీప్​కు తరలించారు. అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లు కూడా క్యాంప్ లోనే కొనసాగా రు. 

అవిశ్వాసం ప్రకటించిన వారిలో బీఎస్పీ కౌన్సిల ర్​ గండూరి పావనిని ఎమ్మెల్యే తన శిబిరంలో చేర్చుకోవడంతో అవిశ్వాస శిబిరంలో 31 మంది మిగిలారు. కోరం కావాలంటే 32 మంది ఉండాలి. దీంతో అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లు కలెక్టర్ వెంకట్రావు నిర్వహించిన మీటింగ్​కు రాలేదు. బీఆర్ఎస్​ తరఫున ఉన్న కౌన్సిలర్లు కూడా మీటింగ్​కు రాకపోవడంతో ఖాళీ కుర్చీలే ఉన్నాయి. దీంతో రెండుసార్లు మీటింగ్​ను వాయిదా వేసిన కలెక్టర్.. సభ్యులురానందున అవిశ్వాసం వీగినట్టు ప్రకటించారు.