అధికారిక కార్యక్రమాలకు నా భార్యను పిలవండి : జగ్గారెడ్డి

అధికారిక కార్యక్రమాలకు నా భార్యను పిలవండి : జగ్గారెడ్డి
  • అధికారులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచన

సంగారెడ్డి, వెలుగు : ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలు, అధికారిక కార్యక్రమాలకు తన భార్య నిర్మలా రెడ్డికి సమాచారం ఇచ్చి పిలవాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హోదాలో నిర్మలా రెడ్డి అన్ని అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. శనివారం ఆయన రిలీజ్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది.

గతంలో తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు పిలవకపోగా, అప్పటి మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యేను అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎవరిని ఏమి అనలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అదే పద్ధతిలో సంగారెడ్డి నియోజవర్గానికి

చెందిన అధికారులు హుందాగా వ్యవహరించి తన భార్య నిర్మలా రెడ్డిని కూడా గౌరవించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆమెను పిలవాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.