
- సరోజినీ దవాఖానకు క్యూ కట్టిన పేషెంట్లు
- సోమవారం ఒక్కరోజే 400 దాటిన ఓపీ
- స్కూల్ పిల్లల్లో ఎక్కువవుతున్న ఇన్ఫెక్షన్
- జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన
హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో కండ్ల కలక కేసులు భారీగా పెరుగుతున్నాయి. కండ్లు నసులుకుంటూ జనాలు దవాఖాన్ల బాట పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని వేల మంది కండ్ల కలక బారినపడ్డారు. హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి దవాఖానకు సోమవారం ఒక్కరోజే సుమారు 400 మంది కండ్ల కలక బాధితులు వచ్చారు. ఇందులో కొంతమంది ముందు జాగ్రత్తగా వచ్చి ఐ డ్రాప్స్ వేయించుకున్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కూడా కండ్ల కలక బాధితులు ఇంకా వస్తుండటంతో ఆసుపత్రి సిబ్బంది చేసేదేం లేక ఓపీ గేటుకు తాళాలు వేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం సిబ్బందితో తాళాలు తీయించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించిన తరువాతే మందులు ఇవ్వాలని సిబ్బందికి చెప్పారు.
మహబూబాబాద్ లో 2 వేల కేసులు
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కూడా కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో గత పదిహేను రోజుల్లో 2 వేల కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ, ప్రేవేట్ హాస్టళ్ల స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల, కురవి, మరిపెడ మండలాల్లో కండ్ల కలక బాధితులు ఎక్కువగా ఉన్నారు.
ఎలా వస్తుంది?
బాక్టీరియా, వైరస్, అలర్జీ వల్ల కండ్ల కలక వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అలర్జీ ద్వారా వచ్చిన కండ్ల కలక ఇంకొకరికి వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని.. కానీ బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చిన కండ్ల కలక మాత్రం ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుందని కంటి వైద్య నిపుణుడు, డాక్టర్ అమర్‌సింగ్ నాయక్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, మన రాష్ట్రంలో పది రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువైందని ఆయన చెప్పారు. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్ల కలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. స్కూళ్లలో పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి, లేక గుంపుగా ఉన్న ప్రదేశాల్లో అధికంగా ఇది వ్యాపిస్తుందన్నారు. ‘‘అలర్జీ వల్ల వచ్చే కలక ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద ఆధార పడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగేది తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. కానీ తేలికగా తగ్గిపోతుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చేది కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కానీ, కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల చూపు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది” అని ఆయన వివరించారు.
ఎలా వ్యాపిస్తుంది?
ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్, బాక్టీరియా ఇతరుల కండ్లలోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి కంటి నుంచి కారే లిక్విడ్, ఆ లిక్విడ్ తాకిన చేతులు, క్లాత్ ద్వారా ఇంకొకరికి చేరుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉండేవారికి వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశం ఉంటుంది. స్కూల్‌లో లేదా జన సమూహంలో గడిపే వారికి కండ్ల కలకలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు.
నివారణకు ఏం చేయాలి?
కండ్ల కలక ఉన్నవారి వస్తువులను ఇంకొకరు వాడడం, ముట్టుకుని కండ్లలో చేతులు పెట్టుకోవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో కండ్లలో అసలు చేతులు పెట్టుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. కండ్లు తుడుచుకోవడానికి టిష్యూలు వాడుకోవాలని సూచిస్తున్నారు. చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు. స్విమ్మింగ్ ఆపేయాలని చెప్తున్నారు. ‘‘కండ్ల కలక ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్ లేదా చద్దర్లు ఇతరులు వాడకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్‌కు పంపకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి. సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోవడం మంచిది” అని నిపుణులు సూచిస్తున్నారు.
సొంత ట్రీట్మెంట్ వద్దు
కండ్ల కలక వచ్చినవారు ఇతరులకు డిస్టెన్స్ పాటిస్తూ కళ్లద్దాలు పెట్టుకోవాలి. సొంత ట్రీట్మెంట్ చేసుకుంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డాక్టర్ల సూచనల మేరకే చుక్కల మందులు వాడాలి. స్కూలుకు వెళ్లే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సరోజినీ దేవి ఆస్పత్రికి గత నాలుగు రోజులుగా రోజూ వంద మందికిపైనే కండ్ల కలక పేషెంట్లు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 400 మందికి పరీక్షలు చేసి, అవసరమైన మందులను అందజేశాం. మరింత ఎక్కువ మంది వచ్చినా డాక్టర్లమంతా కలిసి చికిత్స చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
-వి. రాజలింగం, సూపరింటెండెంట్, సరోజినీ దేవి కంటి దవాఖాన
లక్షణాలు ఇవే..
- కండ్లు ఎర్రగా మారడం
- కండ్లలో నొప్పి, మంట, దురద రావడం
- కండ్ల నుంచి తరచుగా నీరు కారడం
- కండ్లు వాపు రావడం
- పడుకుని లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం
- ఎక్కువ వెలుగు చూడలేక పోవడం
- ప్రమాదం పెరిగితే కండ్ల నుంచి చీము కారడం