
భోపాల్: ప్రేమ వ్యవహారంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓ కానిస్టేబుల్.. తన ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై కాల్పులు జరిపాడు. దీంతో ప్రియురాలి తండ్రి చనిపోయాడు. యువతి, ఆమె సోదరుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కానిస్టేబుల్ కూడా రైలు కింద పడి చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా మాలిఖేడిలో ఈ ఘటన జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
దేవాస్‌లో పోలీస్ డ్రైవర్‌గా పని చేస్తున్న సుభాష్ ఖరాడి(26), ఓ యువతి(25) ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలేంటో తెలియదుగానీ ఖరాడికి ఆమె దూరంగా ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లిన సుభాష్ .. ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యువతి తండ్రి జాకీర్ ఖాన్(55) ప్రాణాలు కోల్పోగా.. ఆ యువతి, ఆమె సోదరుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్లిద్దరి కండిషన్ సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు, ఆ యువతితో సన్నిహితంగా ఉన్న తన ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ‘‘ఆమె నాకు ద్రోహం చేసినందుకు నేను ఆమెను చంపేశాను. ఎప్పటికీ మర్చిపోలేని బాధను ఆమెకు ఇచ్చాను” అని పోస్ట్ చేశాడు.