కానిస్టేబుల్ ప్రిలిమ్స్​ రివిజన్​ ప్లాన్​

కానిస్టేబుల్  ప్రిలిమ్స్​ రివిజన్​ ప్లాన్​

ఎస్​ఐ ప్రిలిమ్స్​ కఠినంగా ఉందని చాలా మంది అభ్యర్థులు అనుకుంటున్నారు. సిలబస్​ అనుగుణంగా పేపర్​ ఇవ్వడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్ష టఫ్​గా ఉందనే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే రానున్న కానిస్టేబుల్​ ప్రిలిమ్స్​ ఎగ్జామ్​లో సిలబస్​ ప్రకారం పేపర్​ ఇచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనువుగా పరీక్షకు సిద్ధం కావాలి. ఎగ్జామ్​ హాల్​లో టైమ్​ మేనేజ్​మెంట్​ చాలా ముఖ్యం.  తొందరపాటు, టెన్షన్​ లాంటి చిన్న పొరపాట్లే ఉద్యోగాన్ని దూరం చేస్తాయి. మూఖ్యంగా యూనిఫామ్​ ఉద్యోగం చేయాలనుకునే వారు పరీక్ష గదిలో కూల్​ మైండ్​తో ఎగ్జామ్​ రాయాలి. 
పరీక్షకు 24 గంటల ముందు నుంచి పుస్తకం ముట్టుకోకుండా ఉండడం మంచిది. రివిజన్​ చేద్దాం అని, టైమ్​వేస్ట్​ అవుతుందని చివరి నిమిషం వరకు అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడితే స్ట్రెస్​కు గురై చదివింది మర్చిపోయే అవకాశం ఉంది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. లేకుంటే దీని ప్రభావం ఎగ్జామ్​ హాల్​లో కనిపిస్తుంది. ఎస్​ఐ పరీక్షలో జనరల్​ స్టడీస్​ విషయంలో  చేసిన పొరపాట్లు కానిస్టేబుల్​ ఎగ్జామ్​లో జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అభ్యర్థులు కేవలం అర్థమెటిక్​, రీజనింగ్​ అంశాలపై ఫోకస్​ చేసి కరెంట్​ ఎఫైర్స్​, జనరల్​ స్టడీస్​ సబ్జెక్టులు నిర్లక్ష్యం చేస్తే చివరకు క్వాలిఫై మార్కులు సాధించలేకపోవచ్చు. కానిస్టేబుల్​, ఎస్​ఐ సిలబస్​లో కొన్ని సబ్జెక్టులలో తేడా ఉంటుంది. దాన్ని గమనించి సిద్ధమవ్వాలి. రెండూ యూనిఫామ్​ ఉద్యోగాలే అయినా సిలబస్​లోని తేడాను గమనిస్తూ ప్రిపరేషన్​ ప్లాన్​ ఉండాలి. 

ఇండియన్​ హిస్టరీ: భారతదేశ సంస్కృతి జాతీయోద్యమం నుంచి సుమారు 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రిపరేషన్​లో భాగంగా ఎక్కువగా జాతీయోద్యమం మీద ఫోకస్​ చేస్తూ రివిజన్​ చేస్తే మంచి స్కోర్​ చేయవచ్చు. 

జనరల్​ ఇంగ్లిష్​: ఎస్​ఐ ప్రిలిమ్స్​లో ఇంగ్లిష్​ సబ్జెక్ట్​ లేదు కానీ కానిస్టేబుల్​ సిలబస్​లో ఉంది. ఇంగ్లిష్​ నుంచి అడిగే ప్రశ్నలకు కరెక్ట్​గా ఆన్సర్​ తెలిస్తేనే రాయడం బెటర్ లేకుంటే నెగెటివ్​ మార్కులు వచ్చే ఛాన్స్​ ఉంది. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ మొదలైన టాపిక్స్​ నుంచి దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

కరెంట్​ ఎఫైర్స్​: నేషనల్​ కరెంట్​ ఎఫైర్స్​ కంటే ఇంటర్నేషనల్​ అంశాలకు ఈ మధ్య కాలంలో అధిక ప్రాధాన్యత ఉంది. గతంలో ఇచ్చినట్టు సాధారణ కరెంట్​ అఫైర్స్​ టాపిక్స్​ నుంచి పరీక్షలో అడగడం లేదు. ఈ విషయం ఎస్​ఐ ప్రిలిమ్స్​ పరీక్ష ద్వారా తెలుస్తుంది. సాధారణంగా ఉండే కరెంట్​ అఫైర్స్​ టాపిక్స్​ అంటే ముఖ్యమైన తేదీలు, అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ వ్యక్తులు, క్రీడా వ్యక్తులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలు మొదలైనవి. ఎస్​ఐ పరీక్ష అనుభవం ఈ సబ్జెక్టులో ఏం తెలియజేస్తుందంటే కాన్సెప్ట్ బేస్డ్​ కరెంట్​ ఎఫైర్స్​ను చదువుకోవాలని, సాధారణ కరెంట్ అఫైర్స్​ కాదు. కాని కానిస్టేబుల్​ పరీక్షలో మాత్రం సాధారణంగా ఉండే కరెంట్ అఫైర్స్​ టాపిక్స్​ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఈ పరీక్ష స్టాండర్డ్​ ఇంటర్మీడియట్​ స్థాయిలోనే ఉంటుంది. 

అర్థమెటిక్​ అండ్ రీజనింగ్: ఈ సబ్జెక్టుకు సంబంధించి టైమ్​ మేనేజ్​మెంట్ చాలా ముఖ్యమైంది. ఎస్​ఐ ప్రిలిమ్స్​ అనుభవం ఇదే తెలియజేస్తుంది. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. అలా కాకుండా ఆన్సర్​ వచ్చేంత వరకు చేసుకుంటూ పోతే సమయం వృథా అవుతుంది. ముందుగా రీజనింగ్​ ప్రశ్నలకు, ఆ తర్వాత సింపుల్​గా ఉన్న అర్థమెటిక్​ ప్రశ్నలు ఆన్సర్​ చేస్తూ కచ్చితంగా క్వాలిఫై మార్కులు వస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. అర్హత సాధిస్తా అని నమ్మకం వస్తే ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు ఆన్సర్​ చేయడానికి ప్రయత్నించాలి.  అంతేకాని సమయాన్ని వృథా చేసుకొని క్వాలిఫై మార్కులు రావట్లేదని బాధపడవద్దు. కానిస్టేబుల్​ ఎగ్జామ్​ ఇంటర్మీడియట్​ స్థాయి పరీక్ష కాబట్టి సాధారణ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. 

ఇండియన్​ పాలిటీ: వినేటప్పుడు వినసొంపుగా ఉండి, చదివేటప్పుడు సులువుగా ఉండి, చెప్పేటప్పుడు ఠక్కున చెప్తాం, కానీ ఎగ్జామ్​ హాల్​లో కన్ఫ్యూజన్​ అయ్యే ఏకైక సబ్జెక్ట్ పాలిటీ మాత్రమే. ఇందులో మొదటగా ప్రాథమిక రాజ్యాంగ అంశాలైన పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల మీద పట్టు సాధించాలి. ఈ అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ లోతుగా ప్రిపేర్​ అవ్వాలి. వీటితో పాటు గవర్నెన్స్​ టాపిక్​ మీద దృష్టి సారించాలి. ఎస్​ఐ ప్రిలిమినరీ పరీక్ష అనుభవం నేర్పిందేమిటంటే సంప్రదాయకమైన ప్రశ్నలు, అధికరణలు, బట్టీ పట్టే విధానాన్ని వదిలిపెట్టే, సమకాలీన అంశాలను సబ్జెక్టుతో అనుసంధానం చేసుకొని సబ్జెక్టు చదువుకోవాలి. లేకపోతే ఇండియన్​ పాలిటీలో వచ్చే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. 
ఇండియన్​ ఎకానమీ: ప్రతి రోజూ న్యూస్​ పేపర్స్​ చదువుతూ కరెంట్​ ఇష్యూస్​ మీద అవగాహన ఉంటే ఇండియన్​ ఎకానమీలో వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు చేయవచ్చు. సమకాలీన అంశాలను, స్టాటిక్​ సబ్జెక్టుతో అనుసంధానం చేసుకొని చదివితే ఎకానమీలో మంచి స్కోర్​ చేయవచ్చు. 

కానిస్టేబుల్​ పరీక్షకు సులువైన మార్గం

మొదటి మార్గం ఇప్పటివరకు చదివిన వాటిని బాగా రివిజన్​ చేయడం, కొత్తగా చదవకూడదు. పాజిటివ్​ వ్యక్తులతో స్నేహం చేయాలి, చర్చలు జరపడం. నెగిటివ్​ ఆలోచన ఉన్న వారి దరికి చేరకూడదు. మనం ధైర్యం కోల్పోయినా, మనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపేవారితో పరీక్షల సమయంలో కలిసి ఉండాలి. స్టోరీలు, కహానీలు, అద్భుతాలు మాట్లాడే వారితో ఎంత దూరంగా ఉంటే, పోటీ పరీక్షల్లో విజయం అంత దగ్గర అవుతుంది. ఎందుకంటే వీటితో కాలం వృథా అవుతుంది. పుస్తకంలో ఉన్న అంశం పక్కకు వెళ్తుంది. పరీక్షా కేంద్రానికి కనీసం రెండు గంటల ముందు చేరుకోవడం మంచిది. వర్షాకాలం కావడంతో మార్గం మధ్యలో ఇబ్బందులతోపాటు రవాణా, ట్రాఫిక్​ సమస్యలు ఎదురుకావచ్చు.

సిలబస్​లో మార్పులు

ఎస్​ఐ పరీక్షలో ప్రిన్సిపుల్స్​ ఆఫ్​ జాగ్రఫీ, భౌగోళిక సూత్రాలు ఉంటాయి. కానిస్టేబుల్​ సిలబస్​లో ఈ టాపిక్​ లేకపోవడంతో ఎగ్జామ్​లో ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. భౌగోళిక సూత్రాలు అనే టాపిక్​ను వరల్డ్​ జాగ్రఫీ అని పొరపాటు పడొద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రమే ఎస్​ఐ పరీక్ష సిలబస్​లో ఉన్నది. కాని కానిస్టేబుల్​ పరీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంశాలు అని సిలబస్​లో ఉంది. కావున తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ జాగ్రఫీ, రాష్ట్ర పాలసీల నుంచి కానిస్టేబుల్​ ప్రిలిమ్స్​లో ప్రశ్నలు అడుగుతారు. వీటి మీద ఫోకస్​ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్​, ఇంగ్లిష్​, తెలంగాణ చరిత్ర, ఇండియన్​ పాలిటీ, కరెంట్​ ఎఫైర్స్​ సబ్జెక్టుల నుంచి 120కి పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటి మీద ఫోకస్​ చేస్తే  కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ సులువుగా పాసవ్వొచ్చు.

తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం

కానిస్టేబుల్​ పరీక్షలో తెలంగాణకు చెందిన అంశాలపై ఎక్కువగా ఫోకస్​ చేస్తారు. సుమారు 15 నుంచి 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ సబ్జెక్ట్ రివిజన్​కు ఎక్కువ సమయం కేటాయించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద కానిస్టేబుల్ ఎగ్జామ్​లో ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. తెలంగాణలోని వివిధ జాతరలు, పండగలు, చరిత్రలో భాగంగా శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, నిజాం హైదరాబాద్‌ సంస్థానం విలీనం, ముల్కీ ఉద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం, జై ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో వివిధ పార్టీల పాత్ర, 2001లో టీఆర్​ఎస్​ ఆవిర్భావం నుంచి 2014లో తెలంగాణ వచ్చేవరకు ముఖ్య పరిణామాల మీద శ్రద్ధ పెట్టాలి. 

ఈ నెల 28న జరిగే కానిస్టేబుల్​ ప్రిలిమినరీ పరీక్షకు సంపూర్ణంగా సన్నద్ధం కావాలంటే ఆగస్టు 7న జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్​ పరీక్ష అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్‌ఐ పరీక్షలో చాలామంది అభ్యర్థులు కొత్త ప్రశ్నలను చూసి పూర్తిగా చదవకుండానే అయోమయానికి గురయ్యారు. కానిస్టేబుల్‌ పరీక్షలో అభ్యర్థులు ఈ పొరపాటు చేయకుండా ఒత్తిడికి గురికాకుండా ప్రశ్నను పూర్తిగా చదివి జవాబు రాయడానికి సిద్ధం కావాలి. ఇప్పుడున్న సమయం తక్కువ కాబట్టి కొత్తగా ఏ అంశాలూ చదవడానికి ప్రయత్నం చేయకూడదు. చదివిన వాటినే రివిజన్​ చేయాలి. 
పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​