తెలంగాణలో స్థానిక సంస్థల కమిటీలు

తెలంగాణలో స్థానిక సంస్థల కమిటీలు

మౌలిక రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ రక్షణ కల్పించలేదు.  సమాజ అభవృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవల కార్యక్రమాల విఫలం తర్వాత స్థానిక సంస్థల ఏర్పాటుపై పలు కమిటీలను ఏర్పాటు చేశారు.  చివరికి గాడ్గిల్​ కమిటీ సూచనల మేరకు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. 

బల్వంతరాయ్​ మెహతా కమిటీ(1957): సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవల కార్యక్రమాల ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధిస్తున్నామా? లేదా? ఈ లక్ష్య సాధనకు ఏమైనా మార్పులు అవసరమా అనే అంశాలను పరిశీలించడానికి జాతీయ అభివృద్ధి మండలి ఈ కమిటీని 1957, జనవరి 16న నియమించింది. ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్​ వ్యవస్థను సిఫారసు చేస్తూ నివేదికను 1957, జనవరి 24న సమర్పించింది. 1958, జనవరిలో బల్వంత్​రాయ్​ మెహతా కమిటీ సిఫారసులను జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. బల్వంత్​రాయ్​ మెహతా కమిటీని మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని అభివర్ణిస్తారు.  

కమిటీ సిఫారసులు

 • సీడీపీ, ఎన్​ఈఎస్​ఎస్​ రెండు పథకాలను రద్దు చేసి మూడు అంచెల పంచాయతీరాజ్​ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 

 • గ్రామస్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, బ్లాక్​, జిల్లా స్థాయిల్లో ఎన్నికలు పరోక్షంగా జరపాలి.
 • ఐదేండ్లకు ఒకసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. 
 • రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నికలు జరగాలి. 
 • రాజ్యాంగబద్ధంగా విధులను, నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. 
 • పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్​కు పర్యవేక్షక అధికారాలు ఇవ్వాలి. 
 • జిల్లా పరిషత్​కు చైర్మన్​గా కలెక్టర్​ వ్యవహరించాలి. 

అమలు తీరు: దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రమైన రాజస్థాన్​(నాగౌర్​ జిల్లా)లో జవహర్​లాల్​ నెహ్రూ 1959, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. మూడంచెల పంచాయతీరాజ్​ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పటి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1959, నవంబర్​ 1న మహబూబ్​నగర్ జిల్లా షాద్​నగర్​లో ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో జిల్లా శ్రీకాకుళం. 
అశోక్​ మెహతా కమిటీ (1977): ఈ కమిటీని ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా జనతా ప్రభుత్వం 1977, డిసెంబర్​ 12న ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడు అశోక్​ మెహతా. సభ్యులు నంబూద్రిపాద్​, ఎం.జి.రాంచంద్రన్​. ఈ కమిటీని రెండో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా పేర్కొంటారు. ఈ కమిటీ కేంద్రీకృత వృత్తాల విధానం (పరస్పర సంప్రదింపులు, అన్యోన్యత) అనే విధానాన్ని అనుసరించింది. అశోక్​ మెహతా కమిటీ తన నివేదికను 132 సిఫారసులతో 1978, ఆగస్టు 21న సమర్పించింది. 

ముఖ్యమైన సిఫారసులు

 • బల్వంత్​రాయ్​ మెహతా కమిటీ సూచించిన మూడంచెల విధానాన్ని రద్దు చేసి రెండంచెల విధానం ప్రవేశపెట్టాలి అని సూచించింది. 

 • పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి. 
 • ఎన్నికల నిర్వహణ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఆధ్వర్యంలో ఉండాలి. 
 • జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు పంచాయతీల్లో రిజర్వేషన్​ కల్పించాలి. 
 • మండల పంచాయతీలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. 
 • శాసన సభ్యులతో కూడిన కమిటీ పంచాయతీ నిధులు, ఖర్చులపై సోషల్​ ఆడిట్​ నిర్వహించాలి. 
 • గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి.
 • పంచాయతీరాజ్​ సంస్థలోని అన్ని పదవులకు నాలుగేండ్ల కాలవ్యవధి నిర్ణయించాలి. 
 • పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి.

అమలు తీరు: మొరార్జీ దేశాయ్​ ప్రభుత్వం పతనం కావడంతో అశోక్​ మెహతా కమిటీ సూచనలు అమలులోకి రాలేదు. కాని కొన్ని మార్పులతో కొన్ని సూచనలు అమలు చేశారు. 
ఎంఎల్​ దంత్​వాలా కమిటీ (1978): బ్లాక్​ స్థాయిలో ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడంపై దంత్​వాలా కమిటీని ఏర్పాటు చేశారు. 

సిఫారసులు

 •  గ్రామ స్థాయిలో సర్పంచ్​ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి. 

 • మాధ్యమిక స్థాయిలో బ్లాక్​ వ్యవస్థను ప్రాధాన్యత ఇవ్వాలి.
 • ప్రణాళికా రచనలో బ్లాక్​ను యూనిట్​గా తీసుకోవాలి. 
 • జిల్లా స్థాయిలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. ఇందులో కలెక్టర్​ ముఖ్యపాత్ర పోషించాలి. 
 • సీహెచ్​ హనుమంతరావు కమిటీ (1994): జిల్లా ప్రణాళికలపై అధ్యయనం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

సిఫారసులు

 • జిల్లా ప్రణాళికా బోర్డును ఏర్పాటు చేయాలి.

 • జిల్లా ప్రణాళికా సంఘాన్ని కలెక్టర్​ లేదా ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
 • జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సమన్వయకర్తగా జిల్లా కలెక్టర్​ వ్యవహరించాలి. 
 • ఎల్​ఎం సింఘ్వీ కమిటీ: ప్రజాస్వామ్యం, అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్​ సంస్థల పునర్నిర్మాణం అనే అంశంపై ఈ కమిటీని నియమించారు. 

సిఫారసులు

 • పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. వాటిని పరిరక్షించాలి. 

 • పంచాయతీలకు రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ఏర్పాటు చేయాలి.
 • కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి ఒక న్యాయ పంచాయతీని ఏర్పాటు చేయాలి. జ్యుడీషియల్​ ట్రిబ్యునల్​ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అది పంచాయతీరాజ్​ వ్యవస్థ ఎన్నిక వివాదాలను, పనితీరును విచారిస్తుంది. 
 • గ్రామసభ ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా ఉండాలి. 
 • గ్రామ పంచాయతీలకు అధిక మొత్తంలో ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాలి.

 
అమలు తీరు: ఎల్​ఎం సంఘ్వీ కమిటీ సూచనల ఆధారంగా రాజీవ్​గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా స్థానిక సంస్థలకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నగరపాలక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలనే ప్రయత్నం చేశారు. గాడ్గిల్​ కమిటీ(1988): పంచాయతీరాజ్​ సంస్థలు ఎలా అయితే బాగా పనిచేస్తాయి అనే అంశం ఆధారంగా వి.ఎన్​.గాడ్గిల్​ అధ్యక్షతన కమిటీ ఏర్పడింది. 

సిఫారసులు

 • పంచాయతీరాజ్​ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. 

 • మూడంచెల వ్యవస్థ ఉండాలి. 
 • అన్ని రకాల స్థాయిల పదవీకాలం ఐదేండ్లు, ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలి. 
 • ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్​ ఉండాలి. 
 • రాష్ట్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి. 
 • అమలు తీరు: గాడ్గిల్​ కమిటీ సిఫారసుల ఆధారంగానే పంచాయతీరాజ్​ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి బిల్​ రూపొందించారు.

జి.వి.కె.రావు కమిటీ (1985): ప్రణాళికా సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి 1985లో జి.వి.కె.రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థను ఉద్యోగస్వామ్యం బలహీన పరిచిందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పంచాయతీరాజ్​ వ్యవస్థ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే  వ్యవస్థ గాక వేర్లు లేని వ్యవస్థగా మారింది. 

సిఫారసులు:

 • ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో జిల్లా పరిషత్​ ఉన్నత స్థానంలో ఉండాలి. 

 • స్థానిక సంస్థలకు నియమిత కాలంలో ఎన్నికలు జరగాలి. 
 • జిల్లా పరిషత్​ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించడానికి డిస్ట్రిక్​ కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేయాలి. 
 • బ్లాక్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్​ అనే పదవిని రద్దు చేయాలి.పి.కె.తుంగన్​ సబ్​ కమిటీ(1988): రాజీవ్​గాంధీ ప్రభుత్వం జిల్లా ప్రణాళికకు సంబంధించి రాజకీయ, పరిపాలనాపరమైన నిర్మాణాన్ని పరీక్షించడానికి పి.కె.తుంగన్​ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. 

సిఫారసులు:

 • స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి.
 • మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి. 
 • జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్​ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి. 
 • పంచాయతీరాజ్​ సంస్థలు ఐదేండ్ల నిర్ణీత పదవీకాలాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ పెంచాల్సి వస్తే ఆ పెంపు ఆరు నెలలు దాటకూడదు. 
 • జనాభా ఆధారంగా రిజర్వేషన్​ కల్పించాలి. 
 • రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
 •  జిల్లా పరిషత్​కు కలెక్టర్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​  ఆఫీసర్​గా ఉండాలి.