అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తెగ తింటున్న ఇండియన్స్.. పెరిగిపోతున్న ఊబకాయం, షుగర్ పేషంట్స్...

 అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తెగ తింటున్న ఇండియన్స్.. పెరిగిపోతున్న ఊబకాయం, షుగర్ పేషంట్స్...

భారతదేశంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) అమ్మకాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో ఊబకాయం (బరువు పెరగడం),  మధుమేహం (షుగర్ వ్యాధి) కేసులు ఎక్కువై, ఆరోగ్యం దెబ్బతింటోందని 'ది లాన్సెట్' న్యూస్ పేపర్లో వచ్చిన ఒక  కొత్త అధ్యయనం హెచ్చరించింది.

UPF అంటే ఏమిటి: UPF అంటే తయారీ సమయంలో చాలా రకాల పద్ధతులు వాడి కొవ్వు (Fats), చక్కెర (Sugar) లేదా ఉప్పు (Salt) ఎక్కువ ఉండేలా తయారుచేసే ప్యాకెట్ ఫుడ్స్. వీటిలో రుచి, రంగు, వాసన కోసం అనవసరమైన హానికరమైన రసాయనాలు (stabilizers, emulsifiers, etc.) కలుపుతారు. ఇలాంటి ఆహారాలు బరువు పెరగడం, షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, డిప్రెషన్,  అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతాయి.

 అయితే 43 మంది అంతర్జాతీయ నిపుణులు రాసిన ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో UPF అమ్మకాలు 2006లో కేవలం 90 కోట్లు  కానీ 2019 నాటికి దాదాపు  3800 కోట్లకు పెరిగాయి. అంటే, కేవలం 13 ఏళ్లలో ఏకంగా 40 రెట్లు పెరిగింది. 

ప్రస్తుతం, దుకాణాల్లో నామ్కీన్లు, నూడుల్స్, బిస్కెట్లు, శీతల పానీయాలు (sweet drinks), చిప్స్, బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాలు వంటి ప్యాక్ చేసిన ఆహారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టివిలో వచ్చే యాడ్స్/ ప్రొమోషన్స్  తో పిల్లలు, యువత వీటిని ఎక్కువగా కొనేలా చేస్తున్నారు. దీని ఫలితంగా భారతదేశంలో ఊబకాయం కేసులు పురుషులలో 12% నుంచి 23%కి, మహిళలలో 15% నుంచి 24%కి   రెండింతలు అయ్యాయి. 

UPF కంపెనీలు చేస్తున్న ప్రకటనలు, మార్కెటింగ్‌ను వెంటనే అడ్డుకోవాలని ఈ రిపోర్ట్ కోరింది. డాక్టర్ అరుణ్ గుప్తా వంటి నిపుణులు మాట్లాడుతూ UPFల వాడకాన్ని తగ్గించడానికి ఇంకా  రాబోయే ఏళ్లలో ఊబకాయం, మధుమేహాన్ని అరికట్టడానికి భారతదేశం తక్షణమే చర్యలు తీసుకోవాలి అన్నారు.

ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి వంటి వాళ్ళు  కేవలం ప్రజల ప్రవర్తన మారాలని చూడకుండా, ప్రభుత్వాలు UPFల తయారీ, మార్కెటింగ్,  వాటిలో వాడిన పదార్థాలపై బలమైన రేగులేషన్స్ తీసుకురావాలని సూచించారు.

ముఖ్యంగా, ప్యాకెట్ల ముందు భాగంలోనే ఉప్పు, చక్కెర, కొవ్వు ఎంత ఉందో స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలి. అలాగే, సెలబ్రిటీలు , క్రీడాకారులు UPFలకు సపోర్ట్ ఇస్తూ చేసే ప్రకటనలను నిషేధించడం అవసరం.