రాజ్యాంగం మంచి చెడూ..పాలకుల చేతల్లోనే..

రాజ్యాంగం మంచి చెడూ..పాలకుల చేతల్లోనే..
  • 1949లో రాజ్యాంగ సభలో అంబేద్కర్ చివరి స్పీచ్

‘‘రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎంచుకునేవాళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు. అమలు చేసే వాళ్లను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోవచ్చు.’’

‘‘దేశానికి అవసరమైన చట్టవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల నిర్మాణాన్ని మాత్రమే ఈ రాజ్యాంగం అందిస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీలు వారి ఆకాంక్షలు, రాజకీయాల కోసం అనుసరించే మార్గాలను బట్టే ఈ వ్యవస్థల పనితీరు ఆధారపడి ఉంటుంది.’’

‘‘భారత ప్రజలు, రాజకీయ పార్టీలు భవిష్యత్‌లో ఎట్లా వ్యవహరిస్తారో ఎవరు చెప్పగలరు? వారి లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలనే అనుసరిస్తారా? లేక విప్లవ ఆలోచనలను కోరుకుంటారా అన్నది ఎవరికి తెలుసు? వారు విప్లవ మార్గాలనే ఎంచుకుంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా సరే ఫెయిలవుతుందని వేరే చెప్పనక్కరలేదు. ప్రజలు, వారి రాజకీయ పార్టీలు ఎట్లా ప్రవర్తిస్తారన్నది చెప్పకుండా రాజ్యాంగం మంచిచెడులపై మాట్లాడడంలో అర్థం లేదు.’’

‘‘కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్టవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాల విభజనను రాజ్యాంగమే చెప్పడం సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రం. ఇదే సూత్రం మన రాజ్యాంగంలో ఉంది. ఇందులో ఎలాంటి లోపం లేదు. అందువల్ల రాష్ట్రాలను కేంద్ర పెత్తనం కింద ఉంచారనడం సరికాదు. అధికారాల విభజన హద్దులను కేంద్రం తనకు తానుగా మార్చలేదు. న్యాయవ్యవస్థ కూడా వీటిని మార్చలేదు.’’

 ‘‘సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇది స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని జీవనసూత్రాలుగా గుర్తించే మార్గం. ఈ మూడింటిని వేర్వేరుగా చూడడానికి వీలులేదు. వీటిలో ఏ ఒక్కదాన్ని వేరుచేసి చూసినా ప్రజాస్వామ్య లక్ష్యమే దెబ్బతింటుంది.’’

రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఎందుకు మార్చాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేసీఆర్​పై మండిపడుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఇష్టమున్నట్లు మాట్లాడుడేందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తున్నాయి. అయితే.. రాజ్యాంగం గురించి, పాలకుల వ్యవహార శైలి గురించి ఆనాడే అంబేద్కర్​ స్పష్టంగా చెప్పారు. ‘‘మనం ఎంచుకునెటోళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారొచ్చు..” అని  1949లో రాజ్యాంగ సభలోనే అన్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు.