సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరియైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో, బాధ్యతగా విధులు నిర్వహించి అర్హులైన వారిని గుర్తించాలన్నారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ క్షేత్రస్థాయిలో అధికారులు విధి నిర్వహణలో ఏమైనా తప్పు చేసినా, లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా అవకతవకలు జరిగినా లోతుగా విచారించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 14432 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు.
విద్యతో దేనినైనా సాధించవచ్చు..
తుంగతుర్తి: విద్యతో జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి 4, 5వ తరగతి విద్యార్థులతో ముచ్చడించారు. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు పలు ప్రశ్నలను అడిగి విద్యార్థులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అనంతరం మండలంలోని పలు ఐకేపీ, సహకార కేంద్రాల్లోని వడ్లను పరిశీలించి రాబోయే రెండు రోజులు వర్షాలు ఉండడంతో రైతులు వడ్లపై టార్పాలిన్లు కప్పి జాగ్రత్త వహించాలన్నారు.
