హైదరాబాద్: మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరింది. పట్టాలపైకి మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు స్టేషన్లో నిలిచిపోయాయి.
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రెండో ప్లాట్‌ఫామ్‌పై దాదాపు రెండు గంటల పాటు ట్రాక్‌పై నిలిచిపోయింది. బయటకు వెళ్లలేక, ట్రైన్లో గంటల తరబడి కూర్చొలేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే స్టేషన్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లీస్తున్నారు.
మరోవైపు.. భారీ వర్షాలకు నెల్లికుదుర్-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై గాలి దుమరానికి భారీ చెట్టు విరిగి పడింది. నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను తీసుకురావడానికి వెళ్ళుతున్న 108 అంబులెన్స్‌కు రోడ్డుకు అడ్డంగా చెట్టుపడింది. ప్రధాన రహదారిపై పడిన పెద్ద చెట్టును సాహసోపేతంగా గొడ్డలితో నరికి అంబులెన్స్‌కు దారి క్లియర్ చేశారు సిబ్బంది. అనంతరం మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు.
