పెద్దపల్లిలో నత్తనడకన డబుల్​ ఇండ్ల నిర్మాణాలు

పెద్దపల్లిలో నత్తనడకన డబుల్​ ఇండ్ల నిర్మాణాలు
  • జిల్లాకు మంజూరైనవి 3394.. పూర్తయినవి 262 
  • కడుతున్న ఇండ్లు 1669.. స్థలం లేక పునాదులు కూడా తీయనివి 1463
  • ఆందోళనలో లబ్ధిదారులు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఏడున్నరేండ్లయినా జిల్లాలో ఒక్కరికి కూడా ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్​ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించి 3,394 డబుల్ ఇండ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు.

ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఇండ్ల నిర్మాణంలో ఇప్పటికి పూర్తయినవి 262 మాత్రమే. ఇంకా కడుతున్నవి 1,669 కాగా పునాదులు కూడా తీయని ఇండ్లు 1,463 ఉన్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో మంథని మండలంలో 92, కాల్వ శ్రీరాంపూర్​లో 170 మాత్రమే పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం అర్బన్​, మంథని అర్బన్​ లాంటి చాలా ప్రాంతాల్లో స్థలం లేక ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు.

కాంట్రాక్టర్లు దూరం..

నిర్మాణ వ్యయం పెరగడం, జీఎస్టీ తదితర ట్యాక్స్ లతో చాలా ప్రాంతాల్లో డబుల్​ఇండ్లు కట్టడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. ఒక్క డబుల్ బెడ్​రూం ఇంటికి ప్రభుత్వం రూ.5.30 లక్షలు కేటాయించింది. దీంట్లో ఒక్కొ ఇంటి నిర్మాణానికి  రూ.30 వేలు జీఎస్టీ(6 శాతం) కింద పోతోంది. ఈవిధంగా 1000 ఇండ్లు కట్టాలంటే కాంట్రాక్టర్ కు జీఎస్టీ కింది రూ.3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో డబుల్​ఇండ్లు నిర్మించడానికి ఏ కాంట్రాక్టర్ ధైర్యం చేయడం లేదు. 

కట్టిన ఇండ్లు ఇస్తలేరు..

పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాల్వశ్రీరాంపూర్​మండల కేంద్రంలో ఇప్పటికి  262 ఇండ్లు పూర్తయ్యాయి. కనీసం వాటినైనా అర్హులైకు అందించాలని అబ్ధిదారులు కోరుతున్నారు. ప్రతీ ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తున్నామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

మరోవైపు కట్టిన ఇండ్లు డ్యామేజ్ అవుతుండడంతోపాటు ఇండ్ల పరిసరాల్లో ముళ్లపోదలు పెరుగుతున్నాయి. ఇటీవల పెద్దపల్లి కలెక్టర్ సంగీత రామగుండం, అంతర్గాం మండలాల్లో నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇండ్లను పరిశీలించి, వెంటనే ఇండ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పడంతో త్వరలోనే ఇండ్లు పంపిణీ చేస్తారేమో అని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండ్లు ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం

పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన ఇండ్లు వెంటనే పేదలకు అందించాలి. ఏడు సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తూనే ఉన్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి అధికార పార్టీ లీడర్లకు కాకుండా అర్హులైన పేదలకు అందించాలి. లేకపోతే బీజేపీ ఆద్వర్యంలో ఆందోళన చేస్తాం. - బాలసాని సతీశ్, బీజేపీ లీడర్, పెద్దపల్లి