ఆరు నెలల్లో డబుల్​ బెడ్​రూం ఇండ్లన్నరు..ఇంకా గుడిసెల్లోనే

ఆరు నెలల్లో డబుల్​ బెడ్​రూం ఇండ్లన్నరు..ఇంకా గుడిసెల్లోనే
  •    పాలమూరులో బుడగ జంగాల వ్యథ
  •      కాంగ్రెస్​ హయాంలో 66 మందికి ప్లాట్లు  
  •     ఇండ్లు కట్టిస్తామని 2017లో తీసుకున్న టీఆర్ఎస్​ సర్కారు  
  •     ఇంకా గుడిసెల్లోనే ఉంటున్న పేదలు 
  •      కష్టాలు పడుతూ ఇండ్ల కోసం ఎదురుచూపులు

మహబూబ్​నగర్, వెలుగు :  తెలంగాణ రాకముందు...వచ్చిన తర్వాత మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని బోయిల్​కుంటరోడ్డులో ఉంటున్న బుడగ జంగాల బతుకులు ఏమాత్రం మారలేదు. తమకు డబుల్​ఇండ్లు ఎప్పుడిస్తారా అన్న ఆశతో ఆరేండ్లుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో వైఎస్​ సీఎంగా ఉన్నప్పుడు ప్లాట్లు ఇవ్వగా...ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్​ ప్రభుత్వం ఆరు నెలల్లో డబుల్ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని స్థలాలు స్వాధీనం చేసుకుంది. ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో తమ కల నెరవేరే రోజు ఎప్పుడా అని నిరీక్షిస్తున్నారు. 
మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాల్టీలోని బోయిల్​కుంట రోడ్డు (బేడ బుడగ జంగాల కాలనీ)లో ఉన్న సర్వే నంబర్​161లో పది ఎకరాల ప్రభుత్వ ఉంది. ఇందులో ఆగస్టు 18, 2007లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో పట్టణానికి చెందిన 66 బుడగ జంగాల కుటుంబాలకు ప్లాట్లు కేటాయించారు. అప్పటి నుంచి వారు ప్లాట్ల దగ్గరే గుడిసెలు వేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చింది. బుడగజంగాల పరిస్థితిని తెలుసుకుని ఈ ప్లాట్లల్లో ఆరు నెలల్లో డబుల్ ​ ​ఇండ్లు కట్టిస్తామని 2017లో హామీ ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత గుడిసెలను తొలగించి ఇండ్ల నిర్మాణాలను మొదలుపెట్టింది. బాధితులకు తలదాచుకునేదుందుకు స్థలం లేకపోవడంతో డబుల్​ ఇండ్ల నిర్మాణాలకు ఎదురుగా ఉన్న ఖాళీ జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఇది జరిగి ఆరేండ్లవుతున్నా ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాలే పూర్తి చేయలేదు. బుడగ జంగాలు మాత్రం ఇంకా ఆ గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

పనులు ఎక్కడివి అక్కడే...

డబుల్​ఇండ్ల నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తి కావచ్చినా, ఇంటర్నల్​ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇప్పటివరకు ఎలక్ర్టిసిటీ వైరింగ్​చేయలేదు. బల్పులు, స్ట్రీట్​ లైట్లు, కరెంట్​పోల్స్​ఏర్పాటు చేయలేదు. కిటికీలకు అద్దాలు ఫిట్​చేయలేదు. బాత్​రూమ్​, టాయిలెట్లు, కిచెన్​లో వాటర్​ సప్లై కనెక్షన్లు లేవు. గ్రౌండ్​ ఫ్లోర్​ను ఫినిషింగ్​ చేయలేదు. కొన్నిచోట్ల ప్లంబింగ్​పనులు పెండింగ్​లో ఉన్నాయి. పెయింటింగ్​ పనులు చేయాల్సి ఉంది.

స్లాబ్​ నుంచి ఊడొస్తున్న పెచ్చులు 

మూడు బ్లాకుల్లో జీ ప్లస్​వన్​ పద్ధతిలో కడుతుండగా, ఒక్కో బ్లాక్​లో 40 చొప్పున 120 ఇండ్లు నిర్మిస్తున్నారు. ఈ పనులను 2017లో ఓ కాంట్రాక్టర్ దక్కించుకోగా, ఆయన మరో వ్యక్తికి సబ్​ కాంట్రాక్ట్​ ఇచ్చాడు. ఇలా 2017 నుంచి ఇప్పటి వరకు నలుగురు సబ్​ కాంట్రాక్టర్లను మార్చారు. కానీ, పనులు మాత్రం పూర్తి చేయలేదు. చేసిన పనుల్లో కూడా క్వాలిటీ పాటించడం లేదు. స్లాబ్​పనులు నాసిరకంగా ఉన్నాయి. ప్రారంభానికి ముందే పెచ్చులూడుతున్నాయి. మట్టి పోసి, దాని మీద సిమెంట్ ​వేయడంతో నెర్రలు వస్తున్నాయి. గ్రౌండ్​ ఫ్లోర్​లో కొన్ని ఇండ్లల్లో బేస్​మెంట్​లో నాణ్యత లేదు.  

159 మందికి ఒకటే బోరు

బేడ బుడజ జంగాల కాలనీలో 66  కుటుంబాలు ఉంటున్నాయి. ఇందులో 159 మంది ఉండగా, 124 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని కుటుంబాలకు కలిపి ఒకే బోరు ఉంది. దీంతో నీటి అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు కూడా మిషన్​ భగీరథ నీళ్లు అందుబాటులో లేవు. భగీరథ పైపులైన్​ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. దీంతో వీరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లకు వెళ్లి మంచినీటిని కొని తెచ్చుకుంటున్నారు.

వారం, పది రోజుల్లో ఇండ్లు కేటాయిస్తాం

డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల లిస్ట్​ను రెడీ చేయమని తహసీల్దార్​కు చెప్పాం. సర్వే నంబర్​161లో ఉన్న 66 మందికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయిస్తాం. ఈ వారం, పది రోజుల్లో వారితో గృహప్రవేశాలు చేయిస్తాం.
–డాక్టర్​ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల