అటకెక్కిన గంటి మడుగు బ్యారేజీ నిర్మాణం

అటకెక్కిన గంటి మడుగు బ్యారేజీ నిర్మాణం
  • ఏయేటికాయేడు ఎదురుచూపులే!
  • అటకెక్కిన గంటి మడుగు బ్యారేజీ నిర్మాణం
  • బ్యారేజీ కడితే 60 వేలకు ఎకరాలకు సాగునీరు
  • రూ.300 కోట్లతో ప్రభుత్వం ప్రపోజల్ 
  • డీపీఆర్ పూర్తయినా ప్రారంభం కాని పనులు  
  • ఆందోళనలో రైతులు 

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం భీమునిగుళ్ల, సుంకరికోట నడుమ మానేరు నదిపై నిర్మాంచాల్సిన గంటిమడుగు బ్యారేజీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. గతంలో రూ.300 కోట్లతో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం డీపీఆర్ కూడా రెడీ చేయించి ఆమోదించింది. అయితే ఏయేటికాయేడు బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు.  

బ్యారేజీతో టేల్ఎండ్​కు మేలు..

గుంటిమడుగు బ్యారేజీ నిర్మాణంతో ఎస్సారెస్పీ టెయిల్ ఎండ్  రైతులకు ఎంతో మేలు జరగడమే కాక గోదావరిలోకి వృథాగా పోతున్న నీటిని ఉపయోగంలోకి తేవచ్చు. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలనుకున్న బ్యారేజీ వల్ల సుమారు 50వేల నుంచి 60 వేల ఎకరాలకు నీరందించవచ్చు. ఎలాంటి ముంపు లేకుండా రెండు గుట్టల నడుమ 400 మీటర్ల వరకు బ్యారేజీ నిర్మిస్తే మానేరులో దాదాపు 9 కిలో మీటర్ల పొడవు, హుస్సేన్​మియా వాగులో మరో 9 కిలో మీటర్ల పొడవునా నీరు నిల్వ చేసుకోవచ్చు. అలాగే కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం మండలాలతోపాటు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్ తోపాటు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాలకు సాగు నీరందుతుంది.

ఆధిపత్య పోరే అడ్డుపడుతోందా..?

బ్యారేజీ నిర్మాణానికి స్థానిక నాయకుల ఆధిపత్య పోరే అడ్డుపడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2004లో నాటి పెద్దపల్లి ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి గుంటిమడుగు బ్యారేజీ నిర్మాణానికి రూ.100 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. 2009 ఎన్నికల్లో ముకుందరెడ్డి ఓడిపోయి టీడీపీ నుంచి విజయరమణరావు గెలిచినా పనులు ముందుకెళ్లలేదు. 2014 నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో బ్యారేజీ నిర్మాణంపై ఆశలు చిగురించాయి. కానీ ఐడీసీ చైర్మన్ ఈద శంకర్​రెడ్డి బ్యారేజీ బాధ్యత తీసుకోవడం, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, శంకర్ రెడ్డికి మధ్య ఉన్న వర్గపోరుతో బ్యారేజ్ నిర్మాణం మూలన పడిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బ్యారేజీ కడితే రెండు పంటలకు నీరు


మానేరు నదిపై బ్యారేజీ కడితే ఎస్సారెస్పీ కింద ఆయకట్టు భూముల్లో రెండు పంటలు పండుతయి. కాలువ నీళ్లు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. మానేరు నుంచి నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. బ్యారేజీ కట్టి నీళ్లను ఆపినట్లయితే, సాగు, తాగునీరుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేపడితే బాగుంటది.  
- ముద్దసాని సమ్మయ్య, మొట్లపల్లి, పెద్దపల్లి