సీఎం హామీ ఇచ్చినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తలే..తీరని గుర్రంగడ్డ గ్రామస్తుల కష్టాలు

సీఎం హామీ ఇచ్చినా  బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తలే..తీరని గుర్రంగడ్డ గ్రామస్తుల కష్టాలు

గద్వాల, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక దివి గ్రామమైన గుర్రంగడ్డ గ్రామానికి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవటంతో కష్టాలు తీరడం లేదు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్  బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేశారు. అయితే పనులు ప్రారంభించి నాలుగేండ్లు అవుతున్నా 30 శాతం వర్క్స్​ కూడా కంప్లీట్ కాకపోవటంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మండలం గుర్రం గడ్డ దివి గ్రామం కృష్ణానది మధ్యలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ గ్రామంలో 450 మంది ఓటర్లకు ఉండగా, 1,100 జనాభా ఉంటుంది. 

నాలుగేండ్ల కింద శంకుస్థాపన..

గుర్రం గడ్డ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసి రూ.9.47 కోట్లు మంజూరు చేసింది. ఇరిగేషన్  ఆఫీసర్లు టెండర్లు ఖరారు చేయడంతో మంత్రి నిరంజన్ రెడ్డి నాలుగేండ్ల కింద శంకుస్థాపన చేశారు. రంగాపురం వైపు నుంచి బ్రిడ్జి పనులు స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు పిల్లర్ల దశ కూడా దాటలేదు. 33 పిల్లర్లు వేయాల్సి ఉండగా, 18 పిల్లర్లు సగం వరకు వేసి వదిలేశారు. ఇటీవల సీఎం కేసీఆర్  గద్వాలకు వచ్చినప్పుడు గుర్రం గడ్డ బ్రిడ్జి గురించి ప్రస్తావించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేండ్ల కింద రూ.9.47 కోట్లతో టెండర్లు పిలవగా, ఇప్పుడు అంచనా వ్యయం రూ.12 కోట్లకు చేరింది.

3 లక్షల క్యూసెక్కులు వస్తే తిప్పలే..

కృష్ణా నదికి 3 లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తే దివి గ్రామస్తులకు కష్టాలు వచ్చినట్లే. తక్కువ వరద ఉంటే పుట్టీలు, మర బోట్లతో రాకపోకలు సాగిస్తారు. వరద ఎక్కువగా ఉంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గ్రామంలో 5వ తరగతి వరకే స్కూలు ఉండడంతో పై తరగతుల స్టూడెంట్స్​ను వారి వారి పేరెంట్స్​ వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, గద్వాల పట్టణంలో ఉంచి చదివించుకోవాల్సి వస్తోంది. గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామంలోని యువకులకు పెండ్లిళ్లు కావడం లేదు. దీంతో ఇల్లరికం వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలా ఏళ్ల నుంచి పోరాటం చేసి బ్రిడ్జి మంజూరు చేయించుకున్నా, పనులు పూర్తి చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని బ్రిడ్జి పనులు చేసేలా చూడాలని కోరుతున్నారు.

మా తిప్పలు పట్టించుకుంటలేరు..

బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాం. సీఎం నుంచి కలెక్టర్  వరకు ప్రతి ఒక్కరినీ కలిసి సమస్య వివరించాం. త్వరగా పనులు కంప్లీట్  అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- బాలకృష్ణారెడ్డి, సర్పంచ్, గుర్రం గడ్డ

వచ్చే ఏడాది కంప్లీట్​ అవుతుంది..

గుర్రం గడ్డ బ్రిడ్జి పనులు కొనసాaగుతున్నాయి. ఈ ఏడాది కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాది పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. వివిధ కారణాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి.

- జుబేర్ అహ్మద్, ఈఈ పీజేపీ