మూడోసారైనా ముడిపడేనా..ప్రారంభమైన సరళాసాగర్ బ్రిడ్జి నిర్మాణం పనులు

మూడోసారైనా  ముడిపడేనా..ప్రారంభమైన సరళాసాగర్ బ్రిడ్జి నిర్మాణం పనులు
  • వానాకాలం ముందు వర్క్స్​ స్టార్ట్​ చేసిన కాంట్రాక్టర్
  • ప్రతి ఏటా వరదల్లో కొట్టుకుపోతున్న జనం

వనపర్తి, వెలుగు:  తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న సరళాసాగర్  వాగుపై బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పదేళ్ల కింద బ్రిడ్జి కట్టేందుకు ప్రభుత్వం టెండర్లు పిలువగా, మూడు సార్లు  అగ్రిమెంట్ గడువు ముగియడంతో టెండర్లు రద్దయ్యాయి. దీంతో కొత్త అంచనాలతో కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించింది. వానాకాలం వచ్చిందంటే చాలు ప్రస్తుతం ఉన్న లోలెవల్  బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి.

ఇప్పటి వరకు ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది వానాకాలంలో సరళాసాగర్  సైపన్ లు ప్రారంభమై బ్రిడ్జిపై నుంచి వరద పారింది. ఆ సమయంలో బైక్ పై వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే నెల రోజుల ముందే ప్రైవేట్  కాలేజీ లెక్చరర్ వరదకు బలయ్యారు. ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించాలని మృతుల కుటుంబీకులు, ప్రజలు వాగు వద్ద నిరసన తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని నిలదీశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

రూ.9.25 కోట్లతో నిర్మాణం..

ఉమ్మడి రాష్ట్రంలోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రపోజల్స్​ సర్కారు పంపినా మూలన పడేశారు. పంపించగా పెండింగ్​లో పడిపోయాయి. 2017లో అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనపర్తి, ఆత్మకూరు పట్టణాలను కలిపే ఈ బ్రిడ్జి కోసం రూ.9.25 కోట్లు మంజూరయ్యాయి. 510 మీటర్ల పొడవు, 18 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అంచనా మొత్తం సరిపోదని కాంట్రాక్టర్​ పనులు మొదలు పెట్టి మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత మరొకరు సబ్  కాంట్రాక్ట్  తీసుకొని పదిరోజుల తరువాత వదిలేసి వెళ్లడంతో బ్రిడ్జి నిర్మాణంపై జనం ఆశలు వదులుకున్నారు.

ఇటీవల బ్రిడ్జి పనులు తిరిగి ప్రారంభం కాగా, మూడోసారి అయినా పనులు పూర్తవుతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బ్రిడ్జి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే  ఆలస్యమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే మాత్రం వాగు సమీపంలో దక్షిణ మధ్య రైల్వే గేటు ఉండడం, ఆర్వోబీ నిర్మిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో కేంద్రానికి ప్రపోజల్స్​ పంపించామని చెబుతున్నారు. కేంద్రం స్పందించకపోవడంతోనే పనులు వాయిదా పడుతూ వస్తున్నాయని అంటున్నారు. 

ఆరు నెలల్లో పూర్తి చేస్తాం..

సరళాసాగర్  వాగుపై బ్రిడ్జి పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. 18 పిల్లర్లతో 510 మీటర్ల పొడవుతో బ్రిడ్జిని పటిష్టంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెక్ డ్యాం కమ్  రోడ్డు బ్రిడ్జిలా దీన్ని నిర్మిస్తున్నాం. 

దానయ్య, ఆర్అండ్ బీ , డీఈ, వనపర్తి

ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా..

ప్రతి రోజు వేలాది వెహికల్స్​ ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే జిల్లా నుంచి కర్నాటకలోని రాయచూరుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోలెవల్ బ్రిడ్జిపై వరద వచ్చినా ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా రూ.15 లక్షలతో బారికేడ్లను నిర్మించారు. పాత బ్రిడ్జిని అలాగే ఉంచి దాని పక్కనే కొత్త బ్రిడ్జి పనులు మొదలుపెట్టారు. ఇదిలాఉంటే గతంలో మాదిరిగా కాకుండా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు 
కోరుతున్నారు.