
- దేశ వ్యవస్థను నష్టపరిచే భావజాలాన్ని సమర్థించం
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు
హుజూర్ నగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిద్దామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ వ్యవస్థను నష్టపరిచే భావజాలాన్ని సమర్థించమన్నారు. హుజూర్ నగర్ చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పశ్య కన్నమ్మ మృతిచెందగా.. ఆమె కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు.
కన్నమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించిన యోధురాలు పశ్య కన్నమ్మ అని కొనియాడారు. తుపాకుల ద్వారానే చరిత్ర మారుతుందనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి ఎన్ కౌంటర్లను నివారించాలని కోరారు. మావోయిస్టుల కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ నాయక్ తదితరులు ఉన్నారు.