మెరుగుపడిన కన్జూమర్ సెంటిమెంట్‌

మెరుగుపడిన కన్జూమర్ సెంటిమెంట్‌
  • ఎక్కువగా ఖర్చు చేసేది బట్టలు కోసమే..
  • మొత్తంగా మెరుగుపడిన కన్జూమర్ సెంటిమెంట్‌
  • వెల్లడించిన యాక్సిస్ మై ఇండియా సర్వే

హైదరాబాద్‌‌, వెలుగు: ఈ పండుగ సీజన్‌‌లో దగ్గరలోని రిటైల్ స్టోర్ల నుంచే కొనుగోలు జరపడానికి కన్జూమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి బట్టలు, మొబైల్ ఫోన్లు, ఏసీలు, ఆటోమొబైల్స్ వంటి కన్జూమర్ డిస్క్రిషనరీ ప్రొడక్ట్‌‌లను కొనుగోలు చేయడం పెరుగుతోందని కన్జూమర్ల ఆలోచన విధానాలను విశ్లేషించే యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది.

ఈ సర్వే కోసం  దేశంలోని  32 రాష్ట్రాలు, యూటీలకు చెందిన వినియోగదారుల అభిప్రాయాలను టెలిఫోన్ ద్వారా సేకరించామని ఈ సంస్థ పేర్కొంది. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం, దేశంలో కన్జూమర్ సెంటిమెంట్ బలపడింది. అంటే ప్రజలు ఖర్చు చేయడానికి  భయపడడం లేదు. ముఖ్యంగా అత్యవసరం కాని ప్రొడక్ట్‌‌లను కూడా కొనడానికి వెనకడగు వేయడం లేదు.

ఈ దసరా లేదా దీపావళి కోసం బట్టలు కొనుగోలు చేస్తామని 44 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 8 శాతం మంది ఏసీ, ఫ్రీజ్‌‌ వంటి వైట్‌‌ గూడ్స్‌‌ను, టూ వీలర్‌‌‌‌, 4 వీలర్‌‌‌‌ను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో మెజార్టీ మెంబర్లు కుటుంబం కోసం చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు, అత్యవసరం, అత్యవసరం కాని ప్రొడక్ట్‌‌ల కోసం చేసే ఖర్చులు, హెల్త్‌‌కేర్‌‌‌‌, మీడియా కోసం చేసే ఖర్చు వంటి వివిధ సెగ్మెంట్‌‌లోని ట్రెండ్స్‌‌ను విశ్లేషించి ఈ సర్వే చేశామని యాక్సిస్‌‌ మై ఇండియా వివరించింది.

ఈ సర్వేలో మొత్తం 10,058 మంది పాల్గొన్నారని తెలిపింది.  కన్జూమర్ సెంటిమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగుపడినట్టు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. యాక్సిస్ మై ఇండియా సర్వేలో పాల్గొన్న వారిలో  67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, 37 శాతం మంది పట్టణాల్లో నివసించే వాళ్లు. వీరిలో 24 శాతం మంది నార్త్‌‌ ఈస్ట్ ప్రాంతాలకు, 23 శాతం మంది ఈస్టర్న్‌‌ ఇండియాకు చెందిన వారు.

28 శాతం మంది పశ్చిమ భారతానికి, 25 శాతం మంది దక్షిణ భారతదేశానికి చెందిన వారు.  ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది మగవారు కాగా, 39 శాతం మంది మహిళలు.  డిస్క్రిషనరీ  ప్రొడక్ట్‌‌లను కొనుగోలు చేయడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెరిగిందని యాక్సిస్ మై ఇండియా ఎండీ ప్రదీప్‌‌ గుప్తా అన్నారు.  ఫిజికల్‌‌ స్టోర్లకు వెళ్లడం నుంచి ఆన్‌‌లైన్‌‌లో కొనుగోలు జరపడం వరకు కన్జూమర్లు కేవలం ఇంటికి అవసరమయ్యే ప్రొడక్ట్‌‌లే కాకుండా తమ ఫ్యామిలీ కోసం, తమ కోసం కూడా ఖర్చు చేస్తున్నారని వివరించారు.

కానీ, బట్టలు వంటి తక్కువ రేటు ఉండే ప్రొడక్ట్‌‌ల కొనుగోళ్లే ఎక్కువగా ఉండడాన్ని గమనించొచ్చని పేర్కొన్నారు. వెహికల్స్‌‌, ప్రాపర్టీలు వంటి ఖర్చు ఎక్కువగా అయ్యే వాటిని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని అంచనావేశారు. క్యాష్ ట్రాన్సాక్షన్ల హవా కొనసాగుతోందని, మరోవైపు యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్‌‌ కార్డు వాడకం కూడా వేగంగా పెరుగుతోందని ప్రదీప్ గుప్తా తెలిపారు.

యాక్సిస్ మై ఇండియా సర్వేలోని ముఖ్యమైన అంశాలు..

1) 58 శాతం కుటుంబాల  ఇంటి ఖర్చులు కిందటి నెలతో పోలిస్తే పెరిగాయి.

2)  పర్సనల్ కేర్‌‌‌‌, ఇంటికి అవసరమయ్యే ప్రొడక్ట్‌‌ల కొనుగోళ్లు పెరిగాయని 44 శాతం మంది తెలిపారు. 

3) 9 శాతం కుటుంబాలు ఏసీ, కారు, రిఫ్రిజిరేటర్ వంటి అత్యవసరం కాని ప్రొడక్ట్‌‌లపై చేసే ఖర్చు పెరిగింది.

4) హెల్త్‌‌, ఫిట్‌‌నెస్ కోసం చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. 34 శాతం కుటుంబాలు ఈసారి తమ హెల్త్‌‌ ఖర్చులు పెరిగాయని వెల్లడించారు. 

5) ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ (మీడియా) కోసం ఖర్చు చేసే కుటుంబాలు ఈ నెలలో పెద్దగా మారలేదు.

6) ఈ సర్వే ప్రకారం, 6 శాతం కుటుంబాలు  మొబిలిటీ (వెహికల్స్‌‌) కోసం చేసే ఖర్చులు పెరిగాయి.

తక్కువ క్వాంటిటీలోనే కొనడం..

1)  యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం, కిందటేడాదితో పోలిస్తే ఈసారి పండుగ సీజన్‌‌లో ఎక్కువ ఖర్చు చేయాలని 21 శాతం మంది కన్జూమర్లు ప్లాన్ చేసుకున్నారు. కిందటి నెలతో పోలిస్తే ఈ సెంటిమెంట్‌‌ 1 % మెరుగుపడింది.

2) ఈ పండుగ సీజన్‌‌లో ఫ్యామిలీ కోసం చేసే షాపింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని 81 శాతం మంది రెస్పాండెంట్లు వెల్లడించారు.

3) కన్జూమర్లు ఎక్కువగా ఏయే ప్రొడక్ట్ విభాగాల్లో కొనుగోలు చేస్తారో ఈ సర్వే విశ్లేషించింది. ఈసారి పండుగ సీజన్‌‌లో  44 శాతం మంది బట్టల కోసం, 8 శాతం మంది మొబైల్‌‌ఫోన్లు, వైట్ గూడ్స్ (ఏసీ, ఫ్రిజ్‌‌ వంటివి) కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు.

4)  జ్యూవెలరీపై ఖర్చు చేస్తామని కేవలం 6 శాతం మంది, టూ వీలర్ కోసం చేస్తామని 5 శాతం మంది, 4–వీలర్ కోసం ఖర్చు చేస్తామని 3 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ట్రాక్టర్ లేదా కమర్షియల్ వెహికల్‌‌ను కొంటామని ఒక శాతం మంది, హోమ్ లేదా ప్లాట్‌‌ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కోసం ఖర్చు చేస్తామని 2 శాతం మంది వెల్లడించారు. 

5)  ఈ పండుగ సీజన్‌‌లో  దగ్గరలోని రిటైల్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేస్తామని 78% మంది కన్జూమర్లు చెప్పగా, 14 %మంది మాత్రం అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ఈ–కామర్స్‌‌ సైట్‌‌ల  నుంచి కొనుగోలు జరుపుతామని వెల్లడించారు. 

6)  కరోనా ముందు టైమ్‌‌తో పోలిస్తే ఈసారి పెద్ద ప్యాక్‌‌లను కొనడం తగ్గింది. 43 శాతం మంది కన్జూమర్లు తమ నెలవారీ అవసరాల కోసం చిన్న ప్యాక్‌‌లు లేదా చిన్న సైజులో గ్రోసరీలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.