పండగలకి బంగారం కొనేస్తాం

పండగలకి  బంగారం కొనేస్తాం
  • స్మార్ట్​ హోమ్​ అప్లయెన్స్​పైనా ఆసక్తి..
  • హెల్త్​, ఫిట్​నెస్​  గాడ్జెట్లూ కొంటాం
  • యూగవ్​ సర్వేలో వెల్లడి

వెలుగు బిజినెస్​ డెస్క్: ఈ పండగ సీజన్​లో హోమ్​ అప్లయెన్స్​స్​,  బంగారం కొంటామని సిటీలలోని కన్జూమర్లు చెబుతున్నారు. దీపావళి స్పెండింగ్​ ఇండెక్స్​ పేరిట ఒక సర్వే రిపోర్టును యూగవ్​ బుధవారం విడుదల చేసింది. మిగతా వారితో పోలిస్తే మిలినియల్స్​లో ఎక్కువ మంది బంగారమే కొనాలనుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. పండగ సీజన్​లో కన్జూమర్ల బిహేవియర్​ ట్రాక్​ చేసేందుకు యూగవ్​ వరసగా సర్వేలు నిర్వహిస్తోంది. కరోనా రెస్ట్రిక్షన్లు తగ్గిపోయి స్వేచ్ఛగా తిరుగుతుండటంతోపాటు, వ్యాక్సినేషన్​ జోరుగా సాగుతున్న నేపథ్యంలో కన్జూమర్​ కాన్ఫిడెన్స్​ పెరిగినట్లు యూగవ్​ తెలిపింది. కిందటి పండగ సీజన్​తో పోలిస్తే ఈ సారి కొనుగోళ్లు ఎక్కువవుతాయని కూడా సర్వే తేల్చింది. 
హోమ్​ అప్లయెన్స్​స్​ కూడా కావాల్సిందే..
ఆగస్టు మధ్య కాలంలో ఈ ఆన్​లైన్​ సర్వేను నిర్వహించామని యూగవ్​ వెల్లడించింది. రాబోయే మూడు నెలల్లో స్మార్ట్​ హోమ్​ అప్లయెన్సెస్, ఫిట్​నెస్​ గాడ్జెట్స్​ వంటి వస్తువులతోపాటు, బంగారం కొనడానికి రెడీగా ఉన్నామని ఎక్కువమంది సర్వేలో చెప్పినట్లు పేర్కొంది. అంతేకాదు, ట్రావెల్​ చేసేందుకూ ఇష్టపడుతున్నామని వెల్లడించినట్లు వివరించింది. సర్వేలో పాల్గొన్న అర్బన్​ పీపుల్​లో ప్రతి అయిదుగురులో ఇద్దరు స్మార్ట్​ హోమ్​ అప్లయెన్సెస్​ కొంటామని చెప్పగా, మూడో వంతు మంది ట్రావెల్​ చేస్తామని, 32 శాతం మంది హెల్త్, ఫిట్​నెస్​ గాడ్జెట్లు కొంటామని బదులిచ్చారు. ప్రతి పది మందిలో ముగ్గురు లేదా 28 శాతం మంది తప్పనిసరిగా బంగారం కొనాలనుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మిలినియల్స్​ బంగారంపైనే ఎక్కువ ఫోకస్​ పెడుతున్నట్లు సర్వేలో తేలింది. 
ఆభరణాలు కొనేందుకే దక్షిణాది ఆసక్తి...
ప్రాంతాలవారీగా చూస్తే దక్షిణాదిలో ఎక్కువ మంది పండగ సీజన్​లో వ్యక్తిగతంగా వాడుకోవడానికి బంగారం కొనడానికి ఇష్టపడుతుండగా, ఉత్తరాదిలో ఎక్కువ మంది పెట్టుబడిగా బంగారంలో పెట్టేందుకు ఇష్టపడుతున్నట్లు యూగవ్​ సర్వేలో తేలింది. మన దేశంలో చాలా మంది బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తారనే విషయం తెలిసిందే. యూగవ్​ సర్వేలోనూ మరోసారి అదే తేలింది. ప్రతి అయిదుగురిలో ముగ్గురు తమ కోసమో, కుటుంబం కోసమో బంగారం కొంటామని చెప్పగా, మిగిలిన వారు బంగారంలో ఇన్వెస్ట్​ చేస్తామని చెప్పారు. ఈ పండగ సీజన్లో బంగారంపై పెట్టుబడి పెడతామని మిలినియల్స్ చెబుతుంటే, అంతకు ముందు తరాల వారు మాత్రం వ్యక్తిగత వినియోగం (అంటే ఆభరణాలు వంటివి) కోసం బంగారం కొనాలనుకుంటున్నట్లు వెల్లడించారు. బంగారం కొనేటప్పుడు హాల్​మార్క్​ చాలా ముఖ్యమని, అలాగే గ్రాము రేటు, సరయిన బిల్లు కూడా ఇంపార్టెంటేనని కన్జూమర్లు ఈ సర్వేలో చెప్పారు.