ఫేక్ పర్సంటేజీలు..సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో బట్టబయలు

ఫేక్ పర్సంటేజీలు..సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో బట్టబయలు
  • కాంట్రాక్ట్ లెక్చరర్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో బట్టబయలు
  • జాబ్​లో చేరినప్పుడు ఎక్కువ.. మెమోల్లో తక్కువ
  • మార్ఫింగ్ పత్రాలతో కొందరు అభ్యర్థుల మోసం
  • ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి నిజాలు

హైదరాబాద్, వెలుగు: గతంలో జరిగిన కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలకు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగు చూస్తోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలయ్యాక ఇప్పటికే గుర్తింపు లేని యూనివర్సిటీలు, డిస్టెన్స్ స్టడీ సెంటర్లకు చెందిన మెమోలు బయటపడ్డాయి. కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు అప్పట్లో ఫేక్ పర్సంటేజీలు, మెమోల మార్ఫింగ్​తో కొలువులు కొట్టేసిన వ్యవహారం తాజాగా కొందరు నిరుద్యోగుల ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్ నియామకాలను కేవలం పీజీ పర్సంటేజీ ఆధారంగా చేపట్టడంతో అప్పట్లో ఫొటోషాప్​తో మెమోలు మార్ఫింగ్ చేసి, ఫేక్ పర్సంటేజీలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జాయిన్ అయినప్పుడు కొందరిచ్చిన సర్టిఫికెట్లలో 70% (డిస్టింక్షన్) మార్కులకుపైగా ఉన్నట్లు ఇంటర్ బోర్డు రికార్డులు వెల్లడిస్తుండగా.. వారి ఒరిజినల్ మెమోల్లో ఫస్ట్ క్లాస్ మాత్రమే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాల్లో రిజర్వేషన్ ను తుంగలో తొక్కారనే 
ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీ చేయని అధికారులు

పది, పన్నెండేళ్ల క్రితమే కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకం ఆర్జేడీ, ప్రిన్సిపాళ్ల పరిధిలో జరిగినప్పటికీ వారు సమర్పించిన మెమోలు నిజమైనవా? కాదా? అని అధికారులు ఇన్నాళ్లు పట్టించుకోలేదు. జెన్యూన్​ చెకింగ్​ కోసం వాటిని ఆయా వర్సిటీలకు పంపించలేదు. అయితే, సర్వీస్ రెగ్యులరైజేషన్​కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇటీవల పలుమార్లు తమ మెమో జిరాక్స్​లను సమర్పించారు. అధికారులు వీటిని యూనివర్సిటీలకు పంపే అవకాశముండడంతో ఒరిజనల్ మెమో జిరాక్స్​లనే పంపినట్లు తెలుస్తోంది. దీంతో జాయిన్ అయినప్పటి పర్సంటేజీకి.. ఈ మెమోల్లో ఉన్న పర్సంటేజీకి పొంతన కుదరడం లేదని తెలుస్తోంది.

చేరికలు, రోస్టర్ పాయింట్లు రహస్యం

కొత్త జోనల్ విధానం అమల్లోకి రాకముం దు ఇంటర్ బోర్డు వరంగల్ ఆర్జేడీ(ఐదో జోన్) పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉండేవి. 2015లో ఓ ఆర్టీఐ కార్యకర్త 5వ జోన్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల జాబితా, వారి మెమోలు, ఏ రోస్టర్ పాయింట్​లో జాయిన్ అయ్యారనే అంశాలపై సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా కోరారు. దీంతో అప్పట్లో చాలామంది మార్కుల మెమోలకు బదులు కేవలం ప్రొవిజనల్ సర్టిఫికెట్లనే సమర్పించిన సంగతి బయటపడింది. అలాగే 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 1767 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తుండగా.. వారిలో 337 మంది మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా నియామకమైనట్లు, వారినే రోస్టర్ పాయింట్లలో ఫిక్స్ చేసినట్లు ఆర్జీడీ ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది. మిగతా వారంతా ఏ పద్ధతిలో జాయిన్ అయ్యారనే సమాచారాన్ని మాత్రం 
అధికారులు వెల్లడించలేదు.