
వందేండ్ల సింగరేణి సంస్థను యాజమాన్యం క్రమంగా కాంట్రాక్టు బాట పట్టిస్తోంది. స్వరాష్ట్రంలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తే వారి సంఖ్యను తగ్గుముఖం పట్టిస్తూ.. కాంట్రాక్టీకరణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ‘దక్కన్ కంపెనీ’గా వ్యవహారాలు కొనసాగించిన సంస్థ పేరును 1921 డిసెంబర్ 23న ‘ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా మార్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరు జిల్లాల వ్యాప్తంగా సింగరేణి డే ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేసింది.
గోదావరిఖని/మందమర్రి, వెలుగు:సింగరేణి 2000‒01 ఆర్థిక సంవత్సరంలో 56 అండర్ గ్రౌండ్ మైన్లు, 11 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లతో 31.67 మిలియన్ టన్నుల లక్ష్యంతో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కూడా సింగరేణిలో 34 అండర్ గ్రౌండ్ మైన్లు, 15 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లతో 54.30 మిలియన్ టన్నుల లక్ష్యంతో పనిచేసింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు సంస్థలో 61,800 మంది కార్మికులు పనిచేశారు. కాగా సింగరేణి సంస్థ 2022‒23 ఆర్థిక సంవత్సరంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 20 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లతో 74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. కానీ కార్మికుల సంఖ్య 42,200 మందికి పడిపోయింది. అంటే స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో 10 అండర్ గ్రౌండ్ మైన్లు తగ్గిపోగా, ఐదు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లు పెరిగాయి. అదే సమయంలో 19,600 మంది పర్మినెంట్ కార్మికులు తగ్గిపోయారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సింగరేణిలో15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తే 2022‒23 సంవత్సరం నాటికి వారి సంఖ్య 30 వేలకు పెరిగింది. సెక్యూరిటీ, పారిశుద్ధ్యం, గెస్ట్‌హౌస్‌లు, బెల్ట్ క్లీనింగ్, గార్డెనింగ్, హెల్త్, వెహికల్స్, బ్లాస్టింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, ఆఫీస్ బాయ్స్, అండర్‌గ్రౌండ్ సపోర్ట్‌మెన్, రూఫ్‌బోల్టింగ్ తదితర మొత్తం 54 డిపార్ట్‌మెంట్లలో కాంట్రాక్టు వ్యవస్థను తీసుకువచ్చి పర్మినెంట్ కార్మికుల సంఖ్యను క్రమక్రమంగా తగ్గించి వేస్తున్నారు. ఇక కొత్తగూడెంలోని పీవీకే ‒ 5 ఇంక్లైన్‌లో కంటిన్యూయస్ మైనర్‌ను ప్రైవేట్ పరం చేశారు. ఇల్లందులో పూసలపల్లి ఓసీపీలో మట్టితో పాటు బొగ్గును కూడా ప్రైవేటువారికే అప్పగించారు.
పెరుగుతున్న ఓపెన్ కాస్ట్‌లు
భూగర్భ గనులుంటే అందులో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఉంటారు. కానీ బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్న సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లను పెంచుతూ పోతున్నది. 51 శాతం వాటాతో సింగరేణిపై అధికారం చెలాయిస్తున్న తెలంగాణ సర్కార్ భూగర్భ గనులను మూసివేస్తూ వాటి స్థానంలో ఓసీపీలను తవ్వుతున్నది. రామగుండం ఏరియాలో జీడీకే 8వ గని, 8ఏ గని, 9వ గని, 10వ గని, 10ఏ గనిని మూసి వేసి సమీపంలో ఉన్న ఓపెన్ కాస్ట్‌లో కలిపేశారు. తాజాగా గోదావరిఖనిలో జీడీకే 5, 5ఏ గనులను మూసివేసి వాటి స్థానంలో 5వ ఓపెన్‌కాస్ట్‌ను ప్రారంభించారు. జీడీకే 7 ఎల్ఈపీ గనిని కూడా మూసివేయగా, దానిని కోల్ టూరిజంగా మార్పు చేసేందుకు చర్యలు చేపట్టారు. భూపాలపల్లిలో కేటీకే 2వ గనిని, శ్రీరాంపూర్‌లో ఆర్‌కే 8 గని, ఆర్‌కే 1ఏ గనిని కూడా మూసివేసి ఓపెన్ కాస్ట్‌లో కలిపివేశారు. కొత్త భూగర్భ గనులను ప్రారంభించకపోగా, ఉన్న వాటినే మూసివేస్తూ ఓపెన్ కాస్ట్ విస్తరణ పేరుతో అందులో కలిపివేస్తూ టార్గెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ గనుల నుంచి 9 మిలియన్ టన్నుల టార్గెట్ నిర్ణయించుకోగా, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నుంచి 65 మిలియన్ టన్నులను వెలికితీసే లక్ష్యంగా మేనేజ్‌మెంట్ పనిచేస్తోంది.
సింగరేణిపై రాష్ట్రం పెత్తనమే ఎక్కువ
సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 49 శాతం కేంద్ర ప్రభుత్వం వాటాదారులుగా ఉన్నాయి. 51 శాతం ఉన్న రాష్ట్రానికే ఎక్కువ అధికారం ఉండడంతో సంస్థను తన ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుంటోంది. పాల్వంచలోని కేటీపీఎస్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు ఇచ్చినందున రూ.12 వేల కోట్లు, మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి రాష్ట్రానికి కరెంట్ ఇచ్చినందున రూ.8 వేల కోట్లు సింగరేణికి ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. కానీ ఈ రూ.20 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. డీఎంఎఫ్‌టీ, డివిడెండ్లు, సెస్, ఎంపీ, ఎమ్మెల్యేల ఫండ్స్ అంటూ సింగరేణి ఏరియాల్లో సీఎస్‌ఆర్ నిధులను అప్పనంగా ఖర్చు చేస్తున్నారు. భద్రాచలం వరదలకు రూ.వెయ్యి కోట్లు, గోదావరిఖనిలో మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు సింగరేణి నుంచే కేటాయించారు. సింగరేణికి సంబంధం లేని ప్రాంతాల్లో మొక్కలు నాటినా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా సింగరేణి సొమ్మే వాడుతున్నారు. ఇలా సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంలాగా వాడుకుంటూ ఆర్థికంగా దిగజారుస్తోందనే ఆరోపణలున్నాయి. తద్వారా సంస్థకు రావాల్సిన లాభాలు తగ్గిపోయి కార్మికుల సంక్షేమం, ప్రయోజనాలు, లాభాల వాటాపై ప్రభావం పడుతోంది.