సింగరేణి సివిల్‌‌ ఆఫీస్‌‌ ముట్టడి

సింగరేణి సివిల్‌‌ ఆఫీస్‌‌ ముట్టడి

గోదావరిఖని, వెలుగు :  న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గురువారం గోదావరిఖనిలోని సింగరేణి సివిల్‌‌ ఆఫీస్‌‌ను ముట్టడించారు. అంతకుముందు గోదావరిఖని మెయిన్‌‌ చౌరస్తా నుంచి గంగానగర్‌‌లోని సివిల్‌‌ ఆఫీస్‌‌ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని సివిల్‌‌ ఆఫీస్‌‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ గార్డులు గేట్లు మూసి అడ్డుకున్నారు. దీంతో ఆఫీస్‌‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు తోకల రమేశ్‌‌, ఇ.నరేశ్‌‌, కె.సునీల్‌‌, వేల్పుల కుమారస్వామి, మద్దెల శ్రీనివాస్‌‌, గొర్రె రమేశ్‌‌, ఎంఏ గౌస్‌‌ మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే పరిష్కారానికి చొరచూపాలన్నారు. లేకపోతే సమ్మెను విరమించేది లేదన్నారు. అలాగే చర్చల పేరుతో సింగరేణి యాజమాన్యం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో అసిస్టెంట్ లేబర్‌‌ కమిషనర్‌‌ ఆఫీస్‌‌లో జరిగే చర్చల్లో పురోగతి లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌ నరహరి పిలుపు మేరకు సమ్మెకు జన అధికార సమితి ప్రతినిధులు మల్క రామస్వామి, పరికిపండ్ల రామయ్య మద్దతు పలికారు. అలాగే కార్పొరేటర్‌‌ ఐత శివకుమార్‌‌, కన్నం తిరుపతి, కోదాటి కుమార్‌‌, తెలంగాణ లేబర్‌‌ పార్టీ ప్రెసిడెంట్‌‌, అడ్వకేట్‌‌ గొర్రె రమేశ్‌‌, ఆమ్‌‌ ఆద్మీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌‌ కన్వీనర్‌‌ మాలెం మధు కూడా సమ్మెకు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు శనిగల శ్రీనివాస్, కోండ్ర మొగిలి, ఉపేందర్, కె.శంకర్ పాల్గొన్నారు.