చేపపిల్లల విడుదల ఆలస్యం..నష్టపోతామంటున్న మత్స్యకారులు

చేపపిల్లల విడుదల ఆలస్యం..నష్టపోతామంటున్న మత్స్యకారులు

గద్వాల, వెలుగు: ఈ సారి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే చెరువులు, రిజర్వాయర్లు నిండాయి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు కూడా తమ ఉపాధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా చెరువుల్లో చేపపిల్లలు విడిచేందుకు అవసరమైన టెండర్లను కంప్లీట్ చేసింది. కానీ, తర్వాత ప్రాసెస్‌‌‌‌ మాత్రం ముందుకు సాగడం లేదు. టెండర్ల పూర్తయి నెల రోజులు దాటుతున్నా కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు చేప పిల్లలను వదలడం లేదు. దీనిపై ఆరా తీయగా ప్రభుత్వం నుంచి ఇంకా ఆర్డర్‌‌‌‌‌‌‌‌ రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. మత్స్యకారులు మాత్రం అదును దాటితే నష్టపోతామని వాపోతున్నారు. 

నెలదాటిపాయే..

గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుతో పాటు 7 రిజర్వాయర్లు, 8 పెద్ద చెరువులు, 411 నోటిఫికేషన్ చెరువులను గుర్తించారు.  వీటిల్లో 1.56 కోటి చేప పిల్లలను వదిలేలా మత్స్యశాఖ ఆఫీసర్లు జూన్‌‌‌‌లో టెండర్లు పిలవగా.. హైదరాబాద్‌‌‌‌కు చెందిన రాజేంద్రకర్ణ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. 411 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజుఉన్న 69 లక్షల చేప పిల్లలు(ఒక్కోటి 65 పైసలు), రిజర్వాయర్లు, పెద్ద చెరువులలో 80 ఎంఎం నుంచి 100 ఎంఎం 85.58 లక్షల పిల్లలు (ఒక్కోటి 1.70 పైసలు) వదిలేలా ఒప్పదం చేసుకున్నారు. 

లేట్ చేస్తే నష్టమే..

జిల్లాలో 50 సొసైటీల్లో 5,300 మంది సభ్యులు ఉన్నారు. వీళ్లందరికీ చెరువులు, రిజర్వాయర్లే ఆధారం.  చెరువుల్లో నాలుగైదు నెలలకు మించి నీరు ఉండదు. ఇందులో వదిలిన చేప పిల్లలు మినిమం రెండు కేజీలు కావడానికి దాదాపు ఎనిమిది నెలలు పడుతుంది.  ప్రతి యేడు చేపపిల్లుల కేజీ సైజు కాగానే నీళ్లు ఎండిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈసారి వానాకాలం ప్రారంభంలోనే చెరువులు నిండడంతో చేపపిల్లలను త్వరగా వదులుతాయని భావించామని, ఎప్పటిలాగే లేట్ చేస్తుండడంతో పాయిదా ఉండేటట్లు లేదని వాపోతున్నారు.  

లెక్కల్లో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ చేసేందుకే! 

చేప పిల్లల లెక్కల్లో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ చేయొచ్చనే ఉద్దేశంతో లేట్‌‌‌‌ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  నిరుడు 1.56 లక్షలు టార్గెట్ ఉండగా 1.50 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు లెక్కలు చెబుతున్నా.. ఇందులో సగం కూడా వదలలేదని మత్స్యకారులు అంటున్నారు. చేపపిల్లలను కవర్లలో తీసుకొచ్చి వదులుతారని, ఆఫీసర్లు ఫస్ట్‌‌‌‌ విడతలో వదిలే ఒకటి రెండు కవర్లను లెక్కపెట్టి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు బిల్లులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.  తర్వాత ఎన్ని వదులుతున్నారో..?  ఇడుస్తున్నారో.. లేదో..?  కూడా చూడడం లేదని చెబుతున్నారు.  ప్రస్తుతం కాంట్రాక్టర్  టీఆర్ఎస్ లీడర్ బంధువని,  ఆయన కావాలనే లేట్‌‌‌‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.