ఆర్మూర్​ బీఆర్ఎస్ లో అసమ్మతి

ఆర్మూర్​ బీఆర్ఎస్ లో అసమ్మతి
  • పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇలాకాలో భగ్గుమన్న విభేదాలు
  • మున్సిపల్ ​చైర్​పర్సన్​ వైఖరిపై కౌన్సిలర్ల అసంతృప్తి
  • ఆమె భర్త, మరిది షాడో చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
  • మాక్లూరు ఎంపీపీ తీరుపై మండిపడుతున్న ఎంపీటీసీలు
  • మారకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు

నిజామాబాద్, వెలుగు: ఆర్మూర్​ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నెలకొంది. మున్సిపాలిటీ అధికార పక్షం రెండు గ్రూపులుగా విడిపోయిందనే చర్చనడుస్తోంది. మరోవైపు మాక్లూరు ఎంపీపీ తీరు మార్చుకోకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఎంపీటీసీలు ప్రకటించారు. తాజా పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీలోని విభేదాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల వర్గపోరు బయటపడడంపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అసమ్మతి కౌన్సిలర్లను పిలిచి మాట్లాడినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. మున్సిపల్ ​చైర్​పర్సన్​ను తొలగించాలని ఎమ్మెల్యేకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేను కలిశామని కౌన్సిలర్లు తర్వాత ప్రెస్​మీట్ ​పెట్టి చెప్పారు. ఎమ్మెల్యే బుజ్జగించడంతోనే ఇలా చెప్పారని కొందరు అంటున్నారు.

26 మంది తిరుగుబాటు!

ఆర్మూర్​ మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా, మిగిలినవారు అధికార పార్టీకి చెందినవారు. అయితే మున్సిపల్​చైర్​పర్సన్​పండిత్ వినీత అఫిషియల్​గా మాత్రమే ఉన్నారని, ఆమె భర్త పవన్, మరిది ప్రేమ్​ షాడో చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారని 26 మంది బీఆర్ఎస్​కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. వారిద్దరూ పదవిని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వీరి ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి లాంగ్​ లీవ్​పై వెళ్లినట్లు చర్చ నడుస్తోంది. తమ ప్రమేయం లేకున్నా షాడో చైర్మన్ల అవినీతి ముద్ర తమపై పడుతోందని అధికార పార్టీ కౌన్సిలర్లు ఏకమయ్యారు. అవిశ్వాసం పెట్టి వారి ప్రమేయానికి కల్లెం వేయాలని నిర్ణయించారు. వినీతను పదవి నుంచి తొలగించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇటీవల కౌన్సిలర్లతో సమావేశమై బుజ్జగించినట్లు తెలుస్తోంది. మరి చైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగిస్తారో లేదో చూడాలి.

ఎమ్మెల్యే అనుచరుడనే సైలంట్

మాక్లూర్ ఎంపీపీ ప్రభాకర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీలు మండిపడుతున్నారు. మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా, 13 మంది అధికార పార్టీ వారే. వీరిలో 7 మంది ఎంపీపీకి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మండల మీటింగులకు పిలవకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఇలాగే ఉంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇటీవల డికంపల్లి ఎంపీటీసీ లక్ష్మిని మీటింగుకు పిలవకపోవడంతో మండల మీటింగ్​ను బాయికాట్ చేశారు. ప్రభాకర్ అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడనే ఇన్నాళ్లు సైలంట్​గా ఉన్నామని, ఇకపై ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. 

షాడో లీడర్లతో పార్టీకే నష్టం

ఆర్మూర్​లో షాడో లీడర్లతో పార్టీకి నష్టం జరుగుతోంది. బల్దియా అధికారాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వారి గురించి ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి తెలుసని అనుకుంటున్నాం. బీఆర్ఎస్​లో అసమ్మతి ఉందనడం ప్రతిపక్షాల ప్రచారం మాత్రమే. నిధుల కోసమే మేం ఎమ్మెల్యేను కలిశాం. బల్దియా స్పెషల్ ఫండ్​లో ప్రతి వార్డుకు రూ.50 లక్షలు రిలీజ్ చేస్తామన్నారు. ఆర్మూరు అభివృద్ధికి  కృషి చేస్తానని, సమస్యలపై కౌన్సిలర్లతో చర్చిస్తామని మాటిచ్చారు.

–చక్రు, కౌన్సిలర్, ఆర్మూరు

ఎంపీపీ తీరు మారకపోతే రాజీనామా చేస్తం

ఎంపీపీ నియంతలా వ్యవహరిస్తున్నాడు. తీరు మారకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం. ఎంపీటీసీలను ఎంపీపీ లెక్క చేయట్లేదు. మండల మీటింగులకు పిలవడం లేదు. పైగా ఎంపీపీ అవినీతి పెరిగిపోయింది. పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంది. డికంపల్లి ఎంపీటీసీ లక్ష్మిని ఇటీవల జరిగిన మండల మీటింగుకు పిలవలేదు. మహిళా ఎంపీటీసీని అవమానించడం కరెక్ట్​కాదు. ఇలాగే ఉంటే ఎంపీటీసీ ఫోరం తరఫున హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తాం.
–ఒడ్డెన్న యాదవ్,​ ఎంపీటీసీ, మదనపల్లి