పంచాయతీ ఆఫీసు ముందు వంటావార్పు

పంచాయతీ ఆఫీసు ముందు వంటావార్పు
  • పంచాయతీ ఎదుట వంటావార్పుతో పేదల నిరసన

దుబ్బాక, వెలుగు: అనర్హులకు డబుల్ ​బెడ్​రూమ్ ​ఇండ్లు ఇచ్చారంటూ పంచాయతీ ఎదుట పేదలు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి50 ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 25 పూర్తి కాగా మరో 25 పూర్తి కావాల్సి ఉంది. పూర్తయిన ఇండ్లకు బుధవారం లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో ఇండ్లు రానివారంతా గురువారం గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎకరం నుంచి మూడున్నర ఎకరాల పొలం, ఇల్లు నిర్మించుకోవడానికి ఖాళీ స్థలం ఉన్న కుటుంబాలను సైతం ఎంపిక చేశారని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆరోపించారు. ఆఫీసర్లు తయారు చేసిన మొదటి లిస్ట్​లో నిరుపేద కుటుంబాలకు చెందినవారి పేర్లు ఉన్నాయని, తుది జాబితాలో తమ పేర్లను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై అనర్హుల పేర్లను డబుల్​జాబితాలో పెట్టి ఇళ్లను పంపిణీ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తమపై కనికరం చూపెట్టి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.