గజ్వేల్‌లో ఏమీ మిగిల్చలే.. ఇప్పుడు కామారెడ్డిపై కన్నేసిండు : రేవంత్

గజ్వేల్‌లో ఏమీ మిగిల్చలే.. ఇప్పుడు కామారెడ్డిపై కన్నేసిండు : రేవంత్
  • రూ.2 వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కేసీఆర్ కుట్ర : రేవంత్
  • రైతు పంటలు నష్టపోతే ఎవరూ రాలే, పట్టించుకోలే
  • ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది
  • ముదిరాజ్ బిడ్డలకు కేసీఆర్ ఒక్క సీటూ ఇవ్వలే
  • కానీ వాళ్ల ఓట్లు కావాలని అడుగుతున్నరని ఫైర్
  • గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసి బాధితులను ఆదుకుంటామని హామీ

కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు : గజ్వేల్‌‌లో కేసీఆర్ ఏమీ మిగిల్చలేదని, ఇప్పుడు కామారెడ్డి భూములపై ఆయన కన్నేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చి రూ.200 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, ఇక్కడ రూ.2 వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో నిర్వహించిన  కార్నర్ మీటింగ్స్‌‌లో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ పోటీ చేయాలంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఉన్నాయి. కానీ వాటిని కాదని కామారెడ్డికి వచ్చారు.

ఇక్కడి భూములు పచ్చగా కనిపించటంతో వాటిపై కన్నేశారు. గజ్వేల్‌‌ను ఆయన, ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములు గుంజుకున్నారు. కబ్జా చేశారు. ఇప్పుడు కామారెడ్డిలో భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారు” అని ఆరోపించారు. కామారెడ్డి రైతుల భూములు కాపాడేందుకే తాను ఇక్కడ పోటీ చేస్తున్నానని, కేసీఆర్‌‌‌‌ను వేటాడేందుకు వచ్చానని రేవంత్​రెడ్డి చెప్పారు.

కోనాపూర్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?

రైతులు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఓట్లు అడగడానికి కామారెడ్డికి వస్తున్నారని రేవంత్​రెడ్డి విమర్శించారు. కామారెడ్డి ఏరియాలో రైతులు చనిపోతే రాని కేసీఆర్‌‌‌‌కు.. ఇయ్యాల అమ్మమ్మ ఊరు కోనాపూర్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ‘‘ఇక్కడి రైతుల వడ్లు తడిసి నష్టపోయినప్పుడు ఎవరూ రాలేదు. వడగండ్ల వానతో పంటలు నష్టపోతే పట్టించుకోలేదు. అలాంటి కేసీఆర్‌‌‌‌కు ఇప్పుడు ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది” అని నిలదీశారు. కాపలా కుక్క లెక్క ఉంటానన్న కేసీఆర్..

వీధి కుక్క అని, కేటీఆర్ పిచ్చి కుక్క అని ఫైర్ అయ్యారు. ‘‘ఇక్కడి వాళ్లు చాలామంది బతుకు దెరువు కోసం గల్ఫ్‌‌కు వెళ్తారు. గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం. గల్ఫ్‌‌కు వెళ్లిన వారిని, వెళ్లి వచ్చిన వారిని ఆర్థికంగా ఆదుకుంటాం” అని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. తాను 3 గంటల ముందే ఇక్కడికి రావాల్సిందని, ప్రభుత్వం కుట్ర చేసి తన హెలికాప్టర్ రాకుండా అడ్డుకుందని రేవంత్ ఆరోపించారు.

ఇందిరమ్మ రాజ్యంతోనే  బతుకులు మారుతయి

ముదిరాజ్ బిడ్డలకు కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, వారి ఓట్లు మాత్రం కావాలని అడుగుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌‌‌‌ను ముదిరాజ్‌‌లు ఉతికేస్తారని హెచ్చరించారు. పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల బతుకులు మారుతాయి.    కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ప్రతి నెల ఇస్తాం. పేదల ఇండ్లకు ఉచిత కరెంటు ఇస్తాం. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తాం” అని రేవంత్​రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి షబ్బీర్​అలీ, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.