నాటకం తెచ్చిన తంటా.. 95 మందికి కరోనా 

నాటకం తెచ్చిన తంటా.. 95 మందికి కరోనా 

మంచిర్యాల జిల్లా: నాటక ప్రదర్శన ఆ గ్రామంలో తంటా తెచ్చిపెట్టింది. చాలా కాలం తర్వాత నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో గ్రామస్తులంతా మైమరచి ఊర్రూతలూగారు. తర్వాత టెస్టు చేయించుకుంటే 95 మందికి కరోనా సోకింది. దీంతో నాటక ప్రదర్శనకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు వైద్య సిబ్బంది. అంతేకాదు పాజిటివ్ వచ్చిన వారు ఎక్కడెక్కడ తిరిగింది.. ఎవరెవరిని కలిసింది ఆరా తీస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో గుబులు రేపుతోంది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సుందరసాల గ్రామంలో 15 రోజుల క్రితం చిరుతల రామాయణం నాటక  ప్రదర్శన జరిగింది. ఐదు రోజులపాటు సాగిన నాటక ప్రదర్శనకు హాజరైన వారంతా ఆనందంగా.. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గ్రామంలో రెండు రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 95 మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలోని ప్రజలు అందరికీ టెస్టులు నిర్వహించే పనిలోపడ్డారు. అనుమానం ఉన్న వారిని క్వారెంటైన్ లో ఉండమని సూచనలు చేయడంతోపాటు.. వారు ఎవరెవరిని కలిసిందీ.. ఎక్కడెక్కడ తిరిగింది గుర్తు చేసుకోమని హెచ్చరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారు అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే సామాజిక దూరం పాటిస్తూ క్వారెంటైన్ లో ఉండమని సూచిస్తుండడంతో నాటక ప్రదర్శనకు వెళ్లని వారిలో కూడా గుబులు మొదలైంది. నాటకానికి వెళ్లొచ్చిన వారిని కలిశామేమో అని మధనపడుతున్నారు. అనుమానంతో టెస్టులు చేయించుకునేందుకు ఎదురు చూస్తుండగా.. అనారోగ్య సమస్యలున్నవారిలో గుబులు మొదలైంది.