ఆ ఊరిలో సగం మందికి కరోనా.. ఫుల్ లాక్ డౌన్

ఆ ఊరిలో సగం మందికి కరోనా.. ఫుల్ లాక్ డౌన్
  • గ్రామ శివార్లలో చెక్ పోస్టు పెట్టి స్వయంగా కాపలా కాస్తున్న సర్పంచ్
  • భీమునిగూడెం గ్రామంలో ఎవరికీ ప్రవేశం లేదు.. 
  • గ్రామస్తులు కూడా బయటకు వెళ్లకుండా గస్తీ 
  • తన భర్తతో కలసి గస్తీ కాస్తున్న గిరిజన సర్పంచ్ మడకం పోతమ్మ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గిరిజన గ్రామాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది.250 ఇల్లు ఉన్న ఆ గ్రామంలో ఇప్పటివరకు 130 మంది కరోనా బారిన పడటంతో గ్రామంలో భయాందోళన ఏర్పడింది. రోజు రోజుకి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ గా ప్రకటించారు.  గ్రామంలోకి ఇతర గ్రామస్తులెవరూ వెళ్లకుండా, అలాగే గ్రామస్తులు ఎవరు కూడా ఊరు విడిచి బయటకు రాకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు వద్ద గిరిజన సర్పంచ్ తన భర్తతో కలసి 24గంటలు కాపలా కాస్తున్నారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం లోని గిరిజన గ్రామం భీమునిగూడెం కరోనా కేసులతో కలకలం రేపుతోంది. కేవలం 250 గడపలున్న భీమునిగూడెం పంచాయతీలో 130 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భయాందోళనకు గురిచేస్తోంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై భీమునిగూడెం గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై దృష్టి సారించారు. మండల అధికార బృందం ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించి గ్రామస్తులు ఎవరు బయటకు రాకుండా, అలాగే ఆ గ్రామంలోకి ఎవరు బయట వ్యక్తులు ప్రవేశించకుండా గ్రామ శివారులో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.
ఈ చెక్ పోస్ట్ వద్ద భీమునిగూడెం గ్రామ సర్పంచ్ మడకం పోతమ్మ అమే భర్త కాపలా కాస్తు గ్రామస్తులు ఎవరు బయటకు వెళ్లకుండా బయట వారు గ్రామం లోకి ప్రవేశించకుండా కాపలా నిర్వహింస్తున్నారు,
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోతమ్మ మాట్లాడుతూ 950 మంది జనాభా ఉన్న తమ గ్రామంలో ఇప్పటివరకు 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో 60 మంది కరోనా వైరస్ నుంచి కొలుకోగా మిగతా 70 మంది ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామంలో కోవిడ్ ఉదృతిని దృష్టిలో ఉంచుకొని మండల అధికారులతో చర్చలు జరిపి తమ గ్రామాన్ని కంటైన్నెంట్ గా ప్రకటింపజేసి కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యలు చేపట్టామన్నారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయడంతోపాటు గ్రామస్తులు పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. లాక్ డౌన్ వల్ల గ్రామంలో ఎవరూ ఇబ్బందిపడకుండా ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామంలో కరోనా పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఈవిధంగానే పగలు ,రాత్రి అని తేడాలేకుండా గస్తీ కాసి మా పంచాయతీ ప్రజలను కపడుకుంటామని సర్పంచ్ మడకం పోతమ్మ ధీమా వ్యక్తం చేశారు.