- బెంగాల్ లో ఎన్నికల తర్వాత విజృంభిస్తున్న కరోనా
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత కరోనా విజృంభణ మామూలుగా లేదు. సునామీలా స్వైర విహారం చేస్తోంది. లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నా కేసులు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(77)కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. బుద్ధదేవ్ దాదాపు 11 సంవత్సరాలు శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సతీమణి మీరా భట్టాచార్య, వీరి సహాయకుడికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మాజీ సీఎం సతీమణి చాలా నీరసంగా ఉంటూ ఆహారం తీసుకోలేకపోతుండడంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వారి సహాయకుడికి కరోనా సోకిందని సమాచారం.
