కరోనా కష్టాలు ఆడవాళ్లకే ఎక్కువ!

కరోనా కష్టాలు ఆడవాళ్లకే ఎక్కువ!

కరోనా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే మహిళల మీద కరోనా ప్రభావం మరికాస్త ఎక్కువగానే ఉంది. అదెలా అంటారా? కరోనా ప్యాండమిక్​లో మహిళల మీద గృహహింస బాగా పెరిగింది.

ప్యాండమిక్​లో గృహహింస మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆడవాళ్లు గృహహింస ఎదుర్కొన్నారు. ఇటలీ, యూరప్ దేశాల్లోనూ గృహహింస పెరిగింది. అలాగే  పారిస్​లో గృహహింస 30 శాతం పెరిగింది. స్పెయిన్​, చైనాలోనూ ఇదే పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాలోనూ  గృహహింస 21 శాతం పెరిగింది. ఈ వివరాల్ని ఆయా దేశాల మీడియా సంస్థలే స్వయంగా వెల్లడించాయి. యూఎన్​ స్టడీలోనూ ఇదే తేలింది. 
కౌన్సిల్​ ఆన్​​ క్రిమినల్​ జస్టిస్ ​ వయొలెన్స్​పై చేసిన రివ్యూలో  ప్రపంచవ్యాప్తంగా యావరేజ్​గా 8.1 శాతం గృహహింస పెరిగిందని తేలింది.

ఇవేవో వేళ్ల మీద లెక్కపెట్టి చెబుతున్న లెక్కలు కాదు. జాతీయ మహిళా కమిషన్​ పక్కా లెక్కలు తీసి తేల్చింది. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్, యూనిసెఫ్​, అమెరికన్​ జర్నల్​ ఆఫ్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ల మాట కూడా ఇదే. మరికొన్ని పేరున్న సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే విషయం బయటపడింది. కేవలం మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా  ప్యాండమిక్​లో గృహహింస పెరిగింది. ఇదొక్కటే కాకుండా పిల్లలపైనా లైంగిక వేధింపులు పెరిగాయి. మన దగ్గర ఎలా ఉంది పరిస్థితి అని షీ టీమ్‌ భరోసా సెంటర్‌‌కు వెళ్లి అడిగితే... వాళ్లు ఇలా చెప్పుకొచ్చారు.

ఒత్తిడిని కారణంగా చూపించి...
నగేశ్​ ( పేరుమార్చాం) ఒక ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగి. పోయిన ఏడాది కరోనా టైంలో ఉద్యోగం పోయింది. బయటికెళ్లి ఉద్యోగం వెతుక్కునే పరిస్థితులు లేవు. ఎక్కడా ఓపెనింగ్స్​ లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఉండి రోజంతా భార్యతో పోట్లాట. కోపం ఎక్కువయితే  ఆమెను కొట్టడం. ప్యాండమిక్​లో ఫైల్​ అయిన గృహహింస కేసుల్లో ఒకటి ఇది. అలాగే వర్క్​ ఫ్రమ్​ హోమ్​ స్ట్రెస్​తో భార్యపై చెయ్యి చేసుకున్న కేసులూ  కోకొల్లలు. ఈ విషయాలే కాకుండా కరోనా యాంగ్జైటీ, బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిరావడం వల్ల కలిగిన చిరాకుల్ని ఇంట్లో ఉన్న ఆడవాళ్లపైనే చూపించారు చాలామంది. కానీ, వాటిల్లో కొన్ని మాత్రమే బయటికొచ్చాయి.

ఎంత వరకు కరెక్ట్​?
కారణాలేవైతేనేం భార్యని హింసించడం ఎంతవరకు కరెక్ట్?​ స్ట్రెస్​ ఎక్కువైందని తల్లితో వాదించరు. నాన్నతో పోట్లాడరు. చెల్లిని, అక్కని కొట్టరు. ఫ్రెండ్స్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్​తో తప్పుగా ప్రవర్తించరు. అలాగెందుకంటే సమాజంలో ఎవరితో... ఎలా మెలగాలో తెలుసు. కానీ, భార్య విషయానికొచ్చేసరికి అవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? నచ్చిన వంట వండలేదని, టైంకి టీ, కాఫీలు ఇవ్వలేదని... చెయ్యి చేసుకునే వాళ్లూ ఎక్కువే. ఇలాంటి కేసుల మన చుట్టుపక్కల కూడా కనిపిస్తుంటాయి. భార్యని గ్రాంటెడ్​గా తీసుకోవడం వల్లే గృహహింస పెరుగుతోంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. భార్య ఏం చేసినా పడుతుంది అన్న ఆలోచనల నుంచే ఈ హింస పుడుతుంది అంటున్నారు సైకాలజిస్ట్​లు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆడవాళ్లు  కేసులు పెట్టకపోవడానికి కారణాలేంటి?

కారణాలేంటంటే...
యూనియన్​ హెల్త్​ మినిస్టరీ రిలీజ్​ చేసిన నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు ఆడవాళ్లలో ఒకరు గృహహింస ఎదుర్కొంటున్నారు.  27 శాతం మంది ఆడవాళ్లు పదిహేనేళ్ల లోపే శారీరక హింసకి గురవుతున్నారు. ‘‘ప్యాండమిక్​లో ఈ లెక్కలన్నీ పదింతలు  పెరిగాయి. కానీ, వాటిల్లో చాలావరకు బయటకు రాలేదు. కారణం... ధైర్యం లేకపోవడమే. కంప్లయింట్​ చేస్తే హింస ఇంకా ఎక్కువ అవుతుంది. సమాజం తక్కువగా చూస్తుంది అని చాలామంది కేసులు పెట్టలేదు. కుటుంబ పరువు, పిల్లల పరిస్థితి ఏమవుతుందన్న ఆలోచనతో వెనక్కి తగ్గిన వాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా పుట్టింటి వాళ్లు ఆదరించకపోతే  ఒంటరిగా బతకలేమేమో అన్న భయంతో గృహహింస చాలావరకు గడపదాటలేదు. దురదృష్టమేంటంటే భర్తే కాదు అతడి తోబుట్టువులు, తల్లిండ్రులు కూడా గృహహింస లో భాగంగా ఉంటున్నార”ని చెప్పారు హైకోర్టు అడ్వకేట్​ సయ్యద​ లయీఖ్​ ఉన్నీసా.

కుటుంబం తోడు ఉంటుందా!
అమ్మాయిని... కుటుంబపరువు అని ఫీలవుతారు కొందరు తల్లిదండ్రులు. చదువు, ఉద్యోగం, పెళ్లి.. ఆ తర్వాత మా బాధ్యత తీరినట్టే అనుకుంటున్నారు. ‘పెళ్లి తర్వాత చిన్నాచితకా సమస్యలు సహజం.. సర్దుకుపోవాలి’ అని  నచ్చజెప్తున్నారు. ‘భర్త తోడు లేకపోతే ఎలా?’ అంటారు. ఆడవాళ్లు  కేసుపెట్టినా తోడుండే తల్లిదండ్రులు చాలా తక్కువ. పోలీసులు యాక్షన్​ తీసుకునే లోపే సర్దిచెప్పి ఆడపిల్లని అత్తారింటికి పంపుతున్నారు. చాలా కేసులు బయటికి రాకపోవడానికి, ఆడవాళ్లపై హింస పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. 

ఆలోచనల్లో మార్పు రావాలి
‘‘ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే... ఆలోచనల్లో మార్పు రావాలి. భార్య అంటే మూడు పూటలా  వంట చేయాలి. ఇంటిని చక్కబెట్టుకోవాలి.. భర్త, పిల్లల బాగోగులు చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో వేలు పెట్టకూడదు. భర్త ఏం చేసినా ఎదురు చెప్పకూడదు. భర్త మూడ్​ని బట్టి నడుచుకోవాలి. గిరి గీసినట్టు ఈ సర్కిల్​ లోపలే భార్య జీవితం తిరుగుతుంటుంది ఎక్కువగా. ఆ  గిరిలో ఆడవాళ్లని చూడ్డం మానేస్తే గృహహింస ఎక్కడా జరగదు. ఇలా జరగాలంటే మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. భార్యంటే వస్తువు కాదని వాళ్లకి అర్థం కావాలి. మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రానంత వరకు గృహహింస కొనసాగుతూనే ఉంటుంది” అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్​ సహానా.

వాట్సాప్​ తెచ్చిన తంటా
పూజ(పేరుమార్చాం) ఓ ప్రైవేట్​ స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆన్​లైన్​లో పాఠాలు వింటోంది. ఒకరోజు నేను నీ  క్లాస్​మెట్​ అంటూ వాట్సాప్​లో పూజకి  మెసేజ్​ పెట్టింది ఒకమ్మాయి. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఒకరోజు ఉన్నట్టుండి  ఆ అమ్మాయి న్యూడ్​ పిక్చర్​ షేర్​ చేసింది. ‘నీ ఫ్రెండ్​నే కదా నువ్వూ షేర్​ చెయ్యి’ అన్నది. ఆ మాటల మాయలో పడిన పూజ కూడా​ ఫొటో పంపించింది. ఫొటో పంపాక ‘నేను నీ ఫ్రెండ్​ని కాదు. మీ బయోలజీ టీచర్​’ని అని నిజం బయటపెట్టాడు. ‘నువ్వు న్యూడ్​ వీడియో పంపకపోతే నీ ఫొటో వైరల్​ చేస్తాన’ని బెదిరించాడు. ఇది లాక్​డౌన్​లో  హైదరాబాద్​ షీ టీమ్స్​లో ఫైల్​ అయిన కేసుల్లో ఒకటి. టీచర్లే కాదు బంధువులు కూడా పిల్లల పసి మనసులపై చాలా గాయాలు చేశారు. 
 

తెలిసినవాళ్లే ఎక్కువ
ప్యాండమిక్​లో నమోదైన లైంగిక వేధింపుల​ కేసుల్లో నిందితులు 60 శాతం తెలిసిన వాళ్లేనని షీ టీం రికార్డ్స్​ చెబుతున్నాయి. ఆ విషయం ఇంట్లో చెప్తే నమ్మరేమో, తిడతారేమో, కొడతారేమో అన్న భయాలతో చాలామంది పిల్లలు తమ బాధల్ని తల్లిదండ్రులకి చెప్పుకోలేక పోయారు. కొందరు తమపై లైంగిక హింస జరిగిందన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే చాలామంది పేరెంట్స్​ విషయం తెలిసాక కేసులు పెట్టడానికి ముందుకొచ్చినా, కొందరు కేసుని మధ్యలోనే వెనక్కి తీసుకున్నారు. 

భయమేస్తోంది..
ఆడపిల్లలపై జరిగే దాడులు చూస్తుంటే భయమేస్తోంది. నాకూ ఒక కూతురు ఉంది. రేపటి రోజున తనకి ఏమైనా జరిగితే అన్న ఆలోచననే తట్టుకోలేను నేను. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటా ఎప్పుడూ. అంతేకాకుండా నా కొడుక్కి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో  చెప్తుంటా. ప్రతి పేరెంట్​ మగపిల్లాడ్ని సోషల్​ వాల్యూస్​తో పెంచితే   ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగగలుగుతారు. 
- కోటేశ్వరి, గృహిణి

పెంపకంలో మార్పు రావాలి
మగపిల్లల పెంపకంలో మార్పు వస్తే గృహహింస  జరగదు. సెక్స్యువల్ అబ్యూజ్​ కేసులు ఉండవు.  ప్రతి ఆడపిల్లని గౌరవించాలని చిన్నప్పట్నించీ తల్లి దండ్రులు మగపిల్లలకి చెప్పాలి. ఆడవాళ్లతో వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఆడవాళ్ల పట్ల వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంది? అనే విషయాలు చిన్నప్పట్నించీ గమనించాలి. ఆడవాళ్లపై తప్పుడు అభిప్రాయాలు ఉన్నట్టు అనిపిస్తే వాళ్లకి కౌన్సెలింగ్ ఇవ్వాలి.  
- ​బి. ప్రభాకర్​, హైదరాబాద్​

అవగాహన పెంచాలి
ప్యాండమిక్​లో సోషల్​ మీడియా వాడకం  పెరిగింది. పిల్లలకి ఫోన్​ కంపల్సరీ అయ్యింది. ఫోన్​ వాళ్ల చేతికివ్వడం వరకు ‘ఓకే’. కానీ, వాళ్లు ఫోన్​లో ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న విషయాల్ని కనిపెట్టుకుని ఉండలేదు పేరెంట్స్​. అదే పిల్లల్ని ప్రమాదంలోకి నెడుతుంది. అదీకాకుండా చుట్టుపక్కల ఎలాంటి మనుషులు ఉన్నారన్నది పిల్లలు గమనించకపోవడం కూడా లైంగిక వేధింపులు​ పెరగడానికి కారణం అయ్యింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పిల్లల్లో లైంగిక వేధింపుల గురించి అవగాహన పెంచాలి. గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్​ గురించి వాళ్లకి చెప్పాలి. ‘‘తెలియని వ్యక్తులతో వ్యక్తిగత​ విషయాలు షేర్​ చేసుకోవద్దని. ఎవరైనా ఫొటోలు, వీడియోలు అడిగినా మాకు చెప్పమ’’ని  పేరెంట్స్​, పిల్లలకు చెప్పాలి.  
- శిరీష రాఘవేంద్ర, షీ టీం అడిషనల్​ డీసీపీ

ఆవుల యమున