కోడిగుడ్డు ధర పైపైకి

కోడిగుడ్డు ధర పైపైకి

లాక్​ డౌన్ నుంచి రేటు రెట్టింపైంది

కరోనాతో గుడ్డుకు పెరిగిన డిమాండ్

ఎప్పుడు తినని వారూ తింటున్నా రు

సప్లయి తగ్గడంతో ధరలు పెరిగాయ్‌

రెండేళ్ల నుంచి పౌల్ట్రీ ఇండస్ట్రీకి నష్టాలే

ఇప్పుడే రికవరీ సూచనలు

వెలుగు, బిజినెస్‌‌‌‌డెస్క్: టమాటాలు, ఆలూ, ఉల్లి తర్వాత ఇప్పుడు గుడ్ల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. గుడ్ల రిటైల్ రేటు డజన్‌ మన రాష్ట్రం లో రూ.72 వద్ద పలుకుతోంది. ఒక్కో గుడ్డు రేటు రూ.6 కి చేరింది. అంతకు ముందు 2017లో ఒక్కో గుడ్డు రేటు రూ. 5.75 పలికింది. కరోనా ముందు వరకు ఒక్కో గుడ్డు ధర రూ.3 నుంచి రూ.4 వద్ద దొరికేది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఇమ్యూనిటీ బూస్టప్‌‌‌‌లో గుడ్డు కూడా భాగం కావడంతో చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది. ఎప్పుడూ తినని వారు కూడా ఇప్పుడు గుడ్డు తింటున్నారు. రాష్ట్రంలో గుడ్ల వినియోగం బాగా పెరిగిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్) తెలంగాణ రాష్ట్ర బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్ కూడా చెప్పారు. కరోనా లాక్‌ డౌన్‌ కాలంలో ప్రొడక్షన్‌ కు ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో ధరలు పెరిగినట్టు పేర్కొన్నా రు. కరోనా టైమ్‌‌‌‌లో ఏప్రిల్–మే మధ్య కాలంలో గుడ్ల రేట్లు డజనుకు రూ.44 నుంచి రూ.48 వద్ద పలికాయి. ఆ టైమ్‌‌‌‌లో చికెన్, ఎగ్ సేల్స్ పడిపోవడంతో వ్యాపారులకు బాగా నష్టాలు వచ్చాయి . లాక్‌ డౌన్‌ టైమ్‌‌‌‌లో సుమారు 35–-40 శాతం పౌల్ట్రీ రైతులు తమ వ్యాపా రాలను మూసివేశారు. లేబర్ లేక చాలా కోళ్లు చనిపోయినట్టు చింతావార్ చెప్పారు. గత రెండేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, లక్ష ఎగ్‌ లు అమ్ముడుపోయే దగ్గర.. 70 వేల అమ్ముడుపోయేవని… కానీ ఖర్చు మాత్రం లక్షకు ఉండేదని చింతావార్ చెప్పారు. కానీ ప్రస్తుతం కన్సంప్షన్ పెరిగి, ధరలు పెరగడంతో పౌల్ట్రీ ఫామ్‌‌‌‌లు ఇన్ని రోజులు ఎదుర్కొన్న నష్టాల నుంచి కాస్త ఉపశమనం వచ్చినట్టైందన్నారు. ఇమ్యూనిటీ బూస్టప్‌‌‌‌లో గుడ్డు భాగం కావడంతో గుడ్ల రేట్లు పుంజుకున్నట్టు పేర్కొన్నారు.

పెరిగిన సేల్స్‌..

గుడ్డు వంటి పౌష్టికాహారం తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కరోనా తట్టుకునే శక్తి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గుడ్డు, చికెన్ వంటి వాటి సేల్స్ పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు రెండు కోట్ల వరకు గుడ్డు కన్సంప్షన్ ఉందని చింతావార్ తెలిపారు. మరో కోటి గుడ్లను మహారాష్ట్ర, కర్నాటక వంటి సరిహద్దు రాష్ట్రాలకు సప్లయి చేస్తున్నట్టు చెప్పారు. మన రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాలకు సప్లయి జరుగుతూ ఉంటుంది. కరోనా లాక్‌ డౌన్‌ తో ఇబ్బందులు పాలైన రైతులు.. ప్రొడక్షన్ తగ్గించారు.దీంతో రేట్లు పెరిగాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘చిన్న పిల్లల కోసం ప్రభుత్వం అమలుచేస్తోన్న స్కీమ్స్‌ లో గుడ్లు తప్పనిసరి. ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో కూడా ఇమ్యూనిటీ కోసం పేషెంట్లకు గుడ్లు ఇస్తున్నారు. ఎప్పుడు తినని వారు కూడా ఇప్పుడు గుడ్డు వైపు చూస్తున్నా రు. అందుకే వీటికి డిమాండ్ పెరిగింది’ అని చింతావార్ అన్నారు.

ముంబై, మైసూర్​లలో కూడా పెరిగిన రేట్లు ..

టమాటా కేజీ రూ.80గా, పొటాటో రూ. 40–45 మధ్యలో, ఉల్లి రూ.50గా ఉన్నాయని.. ఈ టైమ్‌‌‌‌లో ప్రొటీన్‌ కు బేసిక్ సోర్స్ అయిన ఎగ్స్ రేటు కూడా పెరగడంతో ఈ ఖర్చులను తామెలా భరించాలని మరోవైపు సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పౌల్ట్రీ రైతులు తమ వ్యాపారాలను మూసివేయడంతో సప్లయి చెయిన్‌లో అంతరాయాలు ఏర్పడ్డాయి . దీంతో ప్రస్తుతం డిమాండ్ మేరకు సప్లయి రావడం లేదని, ఫలితంగా రేట్లు పెరిగినట్టు ట్రేడర్లు కూడా చెబుతున్నారు. ఈ రేట్లు కొన్ని రోజుల పాటు ఇలానే పెరుగుతాయని పేర్కొంటున్నారు. గుడ్ల ధరలు మరో ఏడాది పాటు రూ.5 వద్ద నిలబడితేనే.. గత రెండేళ్లుగా వచ్చిన నష్టాలను తాము భర్తీ చేసుకోగలుగుతామని పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా గుడ్లు, చికెన్ వాడకం బాగా పెరిగి, రేట్లు పెరిగాయి. ముంబైలో కూడా గుడ్ల ధరలు డజను రూ.80 వద్ద పలుకుతున్నాయి. గత వారంతో పోలిస్తే అక్కడ కూడా డజనుకు రూ.10 నుంచి రూ.20 పెరిగింది. ముంబైలో రోజుకి యావరేజ్‌ గా 85 లక్షల ఎగ్స్‌ కన్సంప్షన్ ఉంటే.. సప్లయి 45 లక్షలుగానే ఉంది. అక్కడ పెద్ద మొత్తంలో సప్లయి కొరత ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, ఏపీల నుంచి ఇతర రాష్ట్రాలకు సరిపడినంతగా గుడ్లు రావడం లేదు.