
- బిడ్డ రక్షణ కవచంపై మహమ్మారి దాడి
- 16 మంది గర్భిణులపై స్టడీ
- అందరిలోనూ ఎఫెక్ట్.. రక్తం గడ్డలు కూడా
- సెకండ్ ట్రైమెస్టర్‌లో ఒకామెకు అబార్షన్
కాబోయే అమ్మలకు కరోనా కొత్త కష్టాన్ని మోసుకొచ్చింది. బిడ్డ రక్షణ కవచంపైనా మహమ్మారి దాడికి దిగుతోంది. కడుపులో బిడ్డకు ఊపిరి అందించే మాయకు గాయాన్ని చేస్తోంది. బిడ్డకు రక్తం అందకుండా అడ్డుకుంటోంది. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీలో ఈ విషయం వెల్లడైంది. కరోనా సోకిన 16 మంది గర్భిణులపై స్టడీ చేయగా, అందరికీ ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. అందులో 12 మందిలోని మాయకు గాయాలు కాగా, ఆరుగురిలో రక్తం గడ్డకట్టినట్టు తేల్చారు. కాబట్టి కరోనా సోకిన గర్భిణులను మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
పుట్టిన బిడ్డలు సేఫ్
మొత్తం 16 మందిలో 15 మంది ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చినట్టు సైంటిస్టులు చెప్పారు. ఒకామెకు మాత్రం సెకండ్ ట్రైమెస్టర్ (రెండో త్రైమాసికం)లో అబార్షన్ అయిందన్నారు. అయితే, దానికి కరోనానే కారణమా కాదా అన్నది మాత్రం చెప్పలేమన్నారు. కొందరికి ఇప్పటికే కరోనా వల్ల అబార్షన్ అయిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. మామూలుగా అయితే సెకండ్ ట్రైమెస్టర్‌లో అబార్షన్ అయ్యే చాన్స్ ఒక శాతం కాగా, ఈ విషయంలో మాత్రం ఆ ముప్పు 6 శాతం ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ గుడ్‌న్యూస్ ఏంటంటే హెల్దీగా పుట్టిన ఆ 15 మంది పిల్లలకు కరోనా నెగెటివ్ రావడం. ఆ పిల్లలంతా పూర్తి ప్రెగ్నెన్సీ టైమ్ తర్వాతే పుట్టారని స్టడీని లీడ్ చేసిన వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోల్డ్‌స్టైన్ చెప్పారు. ఇది చిన్న మొత్తంలో చేసిన స్టడీ కాబట్టి దీనిపై ఇంకా పూర్తి అవగాహనకు రాలేమని, కాబట్టి కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణులందరినీ పరిశీలించాల్సిన.. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతానికైతే పిల్లలు సేఫ్ అని గోల్డ్‌స్టైన్ చెప్పారు. లాంగ్‌టర్మ్ ఎఫెక్ట్స్ (మున్ముందు) ఎట్లుంటుందో మాత్రం చెప్పలేమన్నారు. 1918 స్పానిష్ ఫ్లూ టైంలో, ఆ వైరస్ సోకిన మహిళలకు పుట్టిన పిల్లల్లో మాత్రం ఎఫెక్ట్స్ ఉన్నట్టు చెప్పారు. ఆ పిల్లల్లో చాలా మందికి గుండెజబ్బులున్నాయన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ మహిళలకు పుట్టిన బిడ్డలకూ అలాగే జరుగుతుందా అన్నది మాత్రం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
లక్షణాల్లేవ్
స్టడీలో పాల్గొన్న వారికి చాలా వరకు లక్షణాలు లేవని గోల్డ్‌స్టైన్ చెప్పారు. అయితే, మాయ దెబ్బతినడం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ప్లేసెంటాకు గాయం అవడం వల్ల అమ్మ నుంచి పిల్లలకు రక్తసరఫరా సరిగ్గా జరగలేదన్నారు. రోగాలను కంట్రోల్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ అతిగా పనిచేయడం వల్లే ఈ సమస్య అని గుర్తించారు. రక్తం గడ్డకట్టిన ఆరుగురిలోనూ ఇదే సమస్య అని వివరించారు. దాని వల్లే చాలా మంది పేషెంట్లకు గుండెపోటు వస్తున్నట్టు వివరించారు. మాయ సగం వరకు దెబ్బతిన్నా ఏమీ కాదని, అంత పటిష్ఠంగా మాయ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికైతే అది పెద్ద డేంజర్కాకపోయినా, దాని వల్ల ముప్పు మాత్రం ఉంటుందని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో 50 దాటిన కరోనా మరణాలు