కరోనాతో  డిజిటల్ పేమెంట్స్ కే జనం ఇంట్రెస్ట్

కరోనాతో  డిజిటల్ పేమెంట్స్ కే జనం ఇంట్రెస్ట్

ఫుట్ పాత్ షాప్స్ నుంచి మాల్స్ దాకా ఇదే పద్ధతి  
లాక్ డౌన్ తో ఆన్ లైన్ లోనే సరుకుల బుకింగ్ 


హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగాయి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్ ఊపందుకున్నాయి. ఫుట్‌పాత్‌ షాప్స్ నుంచి మాల్స్ దాకా జనం అంతటా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో నగదు చెల్లింపులకు భయపడుతున్నారు. కొందరు బయట సరుకులు కొంటున్నా పేమెంట్లు మాత్రం ఆన్​లైన్​లోనే చేస్తున్నారు. లాక్​డౌన్​ ఉండడం, కంపెనీలు ఆఫర్లు ఇస్తుండడం, తక్కువ ధరలకే లభిస్తుండడం, నేరుగా ఇంటికే తెచ్చి డెలివరీ చేస్తుండడంతో ఆన్ లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు.  మొత్తం చెల్లింపుల్లో 70 % దాకా డిజిటల్​ పేమెంట్ల ద్వారానే జరుగుతున్నాయని నిపుణులంటున్నారు.
అన్నీ యాప్స్ తోనే.. 
కరోనా కంటే ముందు జనం కొన్ని చోట్ల మాత్రమే ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేవారు. కానీ ఇప్పుడు చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకు అంతటా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్ యాప్స్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కిరాణా దుకాణాలు, కూరగాయలు, మెకానిక్‌ సెంటర్లు, హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, టీ సెంటర్లు మొదలుకొని షాపింగ్‌, సూపర్‌ మార్కెట్లు తదితర అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇక నల్లా, కరెంట్‌, ఫోన్‌, టీవీ బిల్లులనూ డిజిటల్‌ పేమెంట్స్ ద్వారా కడుతున్నారు. ఆన్ లైన్ చెల్లింపులకు జనం మొగ్గు చూపుతుండడంతో డిజిటల్ పేమెంట్ యాప్స్ కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇస్తున్నాయి. ఇక ఎక్కువ మంది సరుకులను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్టు, జియో మార్ట్, బిగ్‌ బాస్కెట్‌ తదితర యాప్‌లలో ఆర్డర్లు ఇస్తున్నారు. మెడిసిన్స్, ఫుడ్ ఆర్డర్లకూ ఆయా డెలివరీ యాప్స్ ను వినియోగించుకుంటున్నారు.