ఒమిక్రాన్​ను లైట్​ తీసుకోవద్దు

ఒమిక్రాన్​ను లైట్​ తీసుకోవద్దు
  • వారం క్రితం 1,157.. ఇప్పుడు 1,381 మంది
  • ఆక్సిజన్​పై 546 మంది.. ఐసీయూలో 429 మంది
  • గాంధీలో 3 రోజుల్లో 26 మంది చేరిక
  • ఒమిక్రాన్​ను లైట్​ తీసుకోవద్దని డాక్టర్ల సూచన
  • డెల్టా ముప్పు కూడా పోలేదని వెల్లడి
  • కేసులు పెరిగితే ఇన్​పేషెంట్లూ పెరుగుతారని హెచ్చరిక 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఇన్​పేషెంట్లు పెరుగుతున్నరు. వారం క్రితం ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పేషెంట్ల సంఖ్య 1,157 కాగా.. ఇప్పుడది 1,381కి పెరిగింది. ఇందులో 546 మంది ఆక్సిజన్​ సపోర్ట్​పై చికిత్స తీసుకుంటున్నారు. మరో 429 మంది ఐసీయూలో ఉన్నారు. వారం క్రితం దాకా రోజుకు సగటున నలుగురైదుగురు పేషెంట్లే ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పుడు గత 3 రోజుల్లోనే హైదరాబాద్​ గాంధీ దవాఖానలో 26 మంది కరోనా పేషెంట్లు చేరారు. అయితే, రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులతో పోలిస్తే.. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఇన్​పేషెంట్లు పెరుగుతున్నారని, కేసులు పెరిగేకొద్దీ  ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఒమిక్రాన్​ సోకిన ప్రతి వంద మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ భావిస్తోంది. అందుకు తగ్గట్టు బెడ్లు, మెడిసిన్​ను సిద్ధం చేసి పెట్టుకుంది. సెకండ్​ వేవ్​ పీక్​ స్టేజ్​లో రాష్ట్రంలో అత్యధికంగా ఒకే రోజు 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈసారి పీక్​లో అంతకుమించి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రోజూ హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య 600 నుంచి 800 మధ్య ఉండొచ్చని అంటున్నారు. కేసుల సంఖ్య, వైరస్​ తీవ్రతను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.

లైట్ తీసుకోవద్దు

రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఉండవని, సినిమాలు..షికార్లకు పోవాల్నో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి ప్రభుత్వం వదిలేసింది. మరోవైపు, ఒమిక్రాన్​ సోకినా ఎవరికీ ఏంకావట్లేదన్న ప్రచారం కూడా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. దీంతో కేసులురోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. అయినా జనం లైట్​ తీస్కుంటున్నారు. ఎప్పటిలాగానే హోటళ్లు, బార్లు, మాల్స్​కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఒమిక్రాన్​ను లైట్​ తీసుకోవద్దని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్​తో కూడా జనాలు హాస్పిటళ్లలో చేరుతున్నారని, ప్రాణాలు కూడా కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్​వో సైతం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్​లలో లాగా మన దగ్గరకూడా ఒకేసారి లక్షల్లో కేసులు పెరిగితే హెల్త్​ సౌలతులపై భారం పెరిగే ప్రమాదం ఉందని, బెడ్ల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేరే జబ్బులతో బాధపడేటోళ్లపై ఒమిక్రాన్​ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

డెల్టా ముప్పు పోలె

సెకండ్​వేవ్​లో పరిస్థితి సీరియస్​ అవ్వడానికి కారణమైన డెల్టా వేరియంట్​ ముప్పు కూడా ఇంకా పోలేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడొస్తున్న కేసుల్లో 30% డెల్టావే ఉండొచ్చని ఇటీవల పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జీనోమ్​ సీక్వెన్సింగ్​ చేస్తే తప్ప ఒమిక్రాన్​ సోకిందా? డెల్టానా? అన్నది తేల్చడం కష్టం. వేల సంఖ్యలో కేసులొస్తే అందరికీ జీనోమ్​ సీక్వెన్స్​ చేయడమూ అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో లైట్​ తీస్కుంటే ముప్పును కొనితెచ్చుకున్నట్టేనని డాక్టర్లు వార్నింగ్​ ఇస్తున్నారు. డెల్టా సోకినవారిలో లక్షణాలు బయటపడిన వారం తర్వాతే వారి ఆరోగ్యం సీరియస్​ అయిందని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

లైట్​ తీస్కోవడం చాలా డేంజర్​

ఒమిక్రాన్​తో వచ్చే ఇన్​ఫెక్షన్​ తీవ్రత తక్కువేనని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి రావడం చాలా ప్రమాదకరమైన విషయం. తక్కువ సంఖ్యలోనే అయినా ఒమిక్రాన్​ పేషెంట్లూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూ కేర్​ అవసరమవుతోంది. ఇప్పుడిప్పుడే మరణాలూ నమోదవుతున్నట్టు తెలుస్తోంది. వేరే జబ్బులతో బాధపడేవారికి ఒమిక్రాన్​ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. పాజిటివ్​ కేసుల్లో ఒక శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చినా.. సెకండ్​ వేవ్​ తరహాలో కష్టాలు తప్పకపోవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్​ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎడం పాటించాలి. వ్యాక్సిన్​ను తప్పకుండా వేసుకోవాలి.

- డాక్టర్​ కె. హరిప్రసాద్​, ప్రెసిడెంట్​, అపోలో హాస్పిటల్స్​