కరోనా భయంకరంగా విస్తరిస్తోంది.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

కరోనా భయంకరంగా విస్తరిస్తోంది.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
  • మాజీ మంత్రి షబ్బీర్ అలీ

హైదరాబాద్: కరోనా రోజు రోజుకూ భయంకరంగా విస్తరిస్తోందని.. ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులపై .. మరాణాలపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో ఇప్పుడే పడకలు దొరకని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం చాలా భయంకరంగా ఉందని, ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత కూడా చాలా తీవ్రంగా ఉందన్నారు. వైద్య మంత్రి  చెప్పినా ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని.. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నా .. దేశంలో రివ్యూ చేయని ఏకైక సిఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన విమర్శించారు. స్కూల్స్ బంద్ చేసి వైన్స్ ఓపెన్ చేయడమంటే.. ప్రభుత్వానికి ప్రజలు సచ్చినా సరే డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పుడే తొందర ఏముంది .. కరోనా విస్తరణ తగ్గే వరకు ఈ ఎన్నికలను ఆపాలి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి .. తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ తో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.