కరోనా వచ్చిందని ప్రత్యేక గదిలో ఉంచితే.. కుంగిపోయి ఉరేసుకున్నాడు

కరోనా వచ్చిందని ప్రత్యేక గదిలో ఉంచితే.. కుంగిపోయి ఉరేసుకున్నాడు

కరోనా వచ్చిన వారిని ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్న కుటుంబ సభ్యులు తస్మాత్ జాగ్రత్త. హోం క్వారెంటైన్ పేరుతో ప్రత్యేక గదిలో ఉంచి వారి మానాన వారిని ఒంటరిగా వదిలేస్తే.. కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నవైద్య నిపుణుల హెచ్చరికలు నిజమయ్యాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని పొందుర్తి గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన అమృతరెడ్డి (60) అనే వ్యక్తికి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో 10 రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్య నిపుణుల సూచనల మేరకు అమృత రెడ్డిని ప్రత్యేక గదిలో ఉంచి చూసుకుంటున్నారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ.. టైంకు మందులు, ఆహారం ఇచ్చి ఇతరులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించారు. అయితే ఏం జరిగిందో గాని.. ఒంటరిగా ఉండలేక మానసికంగా కుంగిపోయాడు. శుక్రవారం తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అమృతరెడ్డి. తనకు నయం కాదేమోనని.. ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్న ఘటనలు చూసి భయంతో ఉరేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అనుకోని ఘటనతో షాక్ గురైన వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.