ఐదు నెలలు.. కొన్ని డెవలప్‌‌మెంట్స్!

ఐదు నెలలు..  కొన్ని డెవలప్‌‌మెంట్స్!

మీటర్ డయామీటర్‌‌‌‌ తీసుకుంటే.. అందులో 80 బిలియన్ల వంతు ఉండే ఈ చిన్న వైరస్‌‌.. మనిషిని ముప్పు తిప్పలు పెడుతోంది. సివియర్ ఎక్యూట్‌‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌‌ (సార్స్‌‌), మిడిల్‌‌ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌‌… ఈ రెండు రకాల వైరస్‌‌ వెర్షన్స్ ప్రాణాంతకమని సైంటిస్టులు గుర్తించారు. ఐదు నెలల కింద కరోనా వైరస్‌‌ అంటే ఏంటో తెలియదు. ఈ రోజు ఎక్కడ చూసినా దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ ప్రాజెక్ట్స్‌‌, యాంటీ వైరల్ డ్రగ్స్‌‌ టెస్టులు నడుస్తున్నాయి. ఈ ఐదు నెలల్లో ఏం నేర్చుకున్నాం? ఇప్పుడున్న నాలెడ్జ్‌‌తో ఈ మహమ్మారికి పుల్‌స్టాఫ్‌ పెట్టగలమా?

ఎలా వచ్చింది?


ఈ వైరస్ గబ్బిలం నుంచి వచ్చిందని సైంటిస్టులు కనుక్కున్నారు. అయితే, ఈ వైరస్‌‌ని తట్టుకునే స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ గబ్బిలాలకు ఉండటం వల్ల.. ఇవి వైరస్ సంఖ్య పెరగడానికి ఆవాసాలుగా మారాయని చెప్పారు. తర్వాత గబ్బిలాల నుంచి ఇతర క్షీరదాలకు సోకింది. వైరస్‌‌ని ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా క్షీరదాల్లో లేకపోవడం వల్ల.. వాటిలో వైరస్‌‌ వేగంగా వ్యాపించింది. ముంగీసలాగా ఉండే ప్యాంగలన్ (అలుగు) అనే క్షీరదం నుంచి ఈ వైరస్ మనిషికి సోకినట్టు పరిశోధనల్లో వెల్లడైంది.“ఈ వైరస్‌‌ గబ్బిలం నుంచి ఇతర జంతువులకు సోకింది. ఆ జంతువు కచ్చితంగా మనిషికి దగ్గరగా ఉండేదే! అది మార్కెట్‌‌లోనే సోకి ఉండొచ్చు” అని సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్‌‌ హల్మెస్ అన్నాడు. “గబ్బిలం నుంచి వైరస్‌‌ అంటించుకున్న ఆ జంతువుతో మనిషి ఏ విధంగా కాంటాక్ట్‌‌ అయినా.. మనిషికీ సోకుతుంది. తర్వాత ఆ వ్యక్తి ఇంటికెళ్లి ఇంకొంతమందికి వైరస్‌ని అంటిస్తాడు. ఇన్‌‌ఫెక్ట్ అయిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లలో వైరస్ ఉంటుంది. అలా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి అది మహమ్మారిగా మారింది” అన్నాడు ఎడ్వర్డ్‌‌.

పదిమందిలో ఒకరు


కరోనా సోకిన వ్యక్తి తుంపర్లను పీల్చుకున్నప్పుడు.. అందులో ఉన్న వైరస్ శ్వాసనాళంలోకి ప్రవేశిస్తుంది. “ఈ వైరస్‌‌కి చుట్టూ ప్రొటీన్ సర్ఫేస్ ఉండటం వల్ల.. సులభంగా దాని ఆర్‌‌‌‌ఎన్‌‌ఏను కణాల్లో పడేస్తుంది. ఒక్కసారి దాని ఆర్‌‌‌‌ఎన్‌‌ఏ మన శరీర కణాల్లో పడిందంటే.. అచ్చంగా దాని లాంటి వైరస్‌‌ కాపీలను ఎన్నో తయారు చేసుకుంటుంది. తర్వాత అది కణం నుంచి బయటకు వచ్చి ఇన్‌‌ఫెక్షన్‌‌ని వ్యాప్తి చేస్తుంది. ఈ సమయంలో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వైరస్‌‌ని టార్గెట్‌‌ చేస్తుంది. చాలా కేసుల్లో వైరస్‌‌మీద ఇమ్యూన్ సిస్టమ్ గెలుస్తుంది” అని నాటింగ్‌‌హామ్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జోనథన్ బాల్ చెప్పాడు. “కోవిడ్-19 ఇన్‌‌ఫెక్షన్ సాధారణంగా స్వల్పంగా ఉంటుంది. అయితే, అదే దాని సక్సెస్‌‌కి కారణమవుతోంది. వైరస్ వచ్చిన సంగతి చాలామందికి తెలియకపోవడంతో.. సూపర్‌‌‌‌మార్కెట్‌‌కి, పనికి వెళ్తూ ఇతరులు ఇన్‌‌ఫెక్ట్‌‌ అవడానికి కారణమవుతున్నారు. స్వల్పంగా కోవిడ్‌‌ వచ్చినవాళ్ల ద్వారా వ్యాపిస్తున్న ట్రాన్స్‌‌మిషన్ చైన్‌‌ని బ్రేక్ చేయగలిగితే… ఈ మహమ్మారిని అడ్డుకోవచ్చు” అని బాల్‌‌ వివరించాడు.

ఎందుకు చనిపోతున్నారు?


చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. వైరస్ శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తులను చేరగానే ప్రమాదకరంగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే బలమైన సెల్స్‌‌ని కూడా ఈ వైరస్ నాశనం చేస్తుంది. చనిపోయిన కణాలతో ఊపిరితిత్తులు దగ్గరకి ముడుచుకుంటాయి. ఈ టైంలో ఆ పేషెంట్‌‌కి ఇంటెన్సివ్‌‌కేర్‌‌‌‌ యూనిట్‌‌(ఐసీయూ)లో ట్రీట్‌‌మెంట్‌‌అందించాల్సి వస్తుంది. కొన్ని కేసుల్లో ఇమ్యూన్ సిస్టమ్‌‌ ఎక్కువగా స్పందించి.. వైరస్‌‌పై ఎటాక్ చేయడానికి ఊపిరితిత్తులు ఇంకా ఎక్కువ ఇమ్యూన్‌‌సెల్స్‌‌ని ఆకర్షిస్తున్నాయి. అప్పుడు పేషెంట్‌‌తీవ్రమైన నొప్పితో బాధపడతాడు. ఇమ్యూన్ సెల్స్ ఎక్కువగా ప్రవహించే కొద్దీ.. నొప్పి ఇంకా పెరుగుతుంది. దీనినే ‘సైటోకైన్ స్ట్రోమ్‌‌’ అని అంటారు. గ్రీక్‌‌లో ‘సైటో’ అంటే కణం అని, ‘కినో’ అంటే కదలిక అని అర్థం. ఈ స్ట్రోమ్‌‌ పేషెంట్‌‌ని చంపేస్తుంది. అయితే, ఈ సైటోకైన్ స్ట్రోమ్‌‌ కొంతమందిలోనే ఎందుకు వస్తుందో.. సైంటిస్టులు అంచనా వేయలేకపోతున్నారు.

విముక్తి పొందుతామా?


ఒకటి, రెండు సంవత్సరాల్లో కోవిడ్ 19 కథ ముగుస్తుందని మెజారిటీ వైరాలజిస్ట్‌‌లు నమ్ము తున్నారు. “చాలామంది కోవిడ్ ఇన్‌‌ఫెక్షన్ బారిన పడతారు. కోలుకుంటారు. తర్వాత ఇది కూడా సహజమైన సీజనల్ ఫ్లూగా మారిపోతుంది” అని చెప్పాడు మైక్‌‌. వైరస్ కొన్నాళ్లు మనతో ఉంటుంది. తర్వాత ఇది తక్కువ ప్రాణాంతకంగా మారుతుందని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. చివరికి దీనికి వ్యాక్సిన్ డెవలప్‌‌ అవుతుంది. కాబట్టి, మనం కోవిడ్ నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతామన్నాడు వైరాలజిస్ట్ మైక్.