వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టారా?

వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టారా?
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులకూ టీకాతో భయం లేదు
  • నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌పై లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని, మన దేశంలో వేస్తున్న అన్ని టీకాలు సేఫేనని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కరోనా టీకాలు వేసుకుంటే భవిష్యత్తులో సంతాన లేమి సమస్యలు వస్తాయని, పిల్లలు పుట్టరని జరుగుతున్న ప్రచారం వట్టి అపోహేనని, దానిలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి, మోడర్నా వ్యాక్సిన్లు పాలిచ్చే తల్లులు కూడా ఎటువంటి భయం లేకుండా వేసుకోవచ్చని చెప్పారు. గర్భిణులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని, దీనికి సంబంధించిన అడ్వైజరీని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతోందని వీకే పాల్ తెలిపారు.
త్వరలో ఫైజర్‌కు పర్మిషన్
మన దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, తాజాగా మంగళవారం అమెరికా కంపెనీ మోడర్నా టీకా అత్యవసర వాడకానికి పర్మిషన్ ఇచ్చినట్లు వీకే పాల్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలో అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి రానుందని చెప్పారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 51 డెల్టా ప్లస్ కరోనా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.