- వింటర్ సీజన్‌లో విజృంభించే అవకాశం
- వెల్లడించిన సైంటిస్టులు
బీజింగ్: కరోనాతో ప్రతి ఏటా ముప్పే అని, వింటర్ సీజన్‌లో కచ్చితంగా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అది ఫ్లూ లాగా ప్రతి ఏటా వస్తుందని, మనిషి జీవితంలో ఎక్కువ కాలం ఉంటుందని చైనాలోని పరిశోధన సంస్థ పాథోజెన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జిన్‌కి చెప్పారు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్జీ, ఇన్‌ఫెక్చువస్ డైరెక్టర్ ఆంథోనీ ఫాసీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వింటర్ సీజన్‌లో ఫ్లూగా మారి సీజనల్ వ్యాధిలా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సీజనల్ ఫ్లూ వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల నుంచి 6.5 లక్షల మంది చనిపోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ట్రాన్స్‌మిషన్ రేటు ఉన్న కరోనా చాలాకాలం మనుగడలో ఉంటుందని మన దేశానికి చెందిన సైంటిస్టులు చెప్పారు. ప్రపంచ మానవాళిపై కరోనా చాలా ప్రభావం చూపుతుందని, లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించడం రాను రాను కష్టం అవుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మవలాంకర్ అన్నారు. వైరస్ సోకిన వారిలో మొదటి వారంలో పెద్దగా లక్షణాలు బయటపడవని, దాదాపు ఆ టైంలోనే, అలాంటి వాళ్ల వల్లే 44 శాతం వైరస్ వ్యాప్తి చెందుతోందని అన్నారు. ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్లపై వైరస్ తిరిగి దాడి చేస్తుందని చెప్పారు. వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ దొరికే వరకు సోషల్ డిస్టెంసింగ్, మాస్కులు వేసుకోవడం, చేతులు తరచూ కడుక్కోవడమే మార్గమని అభిప్రాయపడ్డారు.
