
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం పుష్యమి నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించారు. ముందుగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. బంగారు పుష్పాలతో అర్చన చేయగా భక్తులు ఈ ఆర్జిత సేవలో పాల్గొని పూజలు జరిపారు.
కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణం అనంతరం సమస్త నదీ, సముద్ర జలాలతో ప్రోక్షణ చేశారు. తర్వాత భక్తరామదాసు సమర్పించిన ఆభరణాలు అలంకరించారు. కత్తి, డాలు, రాజదండం, రాజముద్రిక చివరిగా కిరీటం అలంకరించి పట్టాభిషేక ఘట్టం చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామయ్యకు ప్రత్యేక హారతులు ఇచ్చారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.